భూపాల్ నాయక్‌కు అనేక రూపాలు..!
మోసం చేయడంలోనూ అనేక ఎత్తుగడలు.. హైటెక్ హంగులతో రూ.6 వేల కోట్ల పెట్టుబడి మోసం.. దేశవ్యాప్తంగా వేలాది మంది బాధితులు

నిజం న్యూస్, హైదరాబాద్, జూలై 5:
హైటెక్ కార్యాలయాలు, భారీ లాభాల హామీలు, ప్రకృతి వ్యవసాయం పేరుతో ప్రచారం, రాజకీయ ప్రచారం, సామాజిక సేవా కార్యక్రమాలు… ఇలా అనేక రూపాల్లో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్బీపీఎల్), కిసాన్ పరివార్ లిమిటెడ్ సంస్థల వ్యవస్థాపకుడు నేనావత్ భూపాల్ నాయక్ చివరకు భారీ పెట్టుబడి మోసం కేసులో పోలీసులకు చిక్కాడు. దేశవ్యాప్తంగా వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ఆయనను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.
ప్రాథమిక విచారణలో దేశవ్యాప్తంగా సుమారు 6 వేల మంది పెట్టుబడిదారులను మోసం చేసి రూ.6 వేల కోట్ల వరకు అక్రమంగా సేకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో దాదాపు 1,500 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నట్లు సమాచారం.
హైటెక్ కార్యాలయాలతో నమ్మకం… కోట్లలో వసూళ్లు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండకు చెందిన భూపాల్ నాయక్ షేర్ మార్కెట్ విశ్లేషకుడిగా తనను తాను పరిచయం చేసుకుంటూ 2020లో షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు కిసాన్ పరివార్ లిమిటెడ్ పేరుతో రెండు సంస్థలను ప్రారంభించాడు.
హైదరాబాద్‌లోని కూకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో అత్యాధునిక కార్యాలయాలు ఏర్పాటు చేసి దాదాపు 30 మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. సంస్థ సెబీ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తోందని, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు అందిస్తామని సోషల్ మీడియా, సెమినార్లు, ఏజెంట్ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు.
48 శాతం వార్షిక లాభాల హామీ
పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు మూడు రకాల పథకాలను ప్రవేశపెట్టారు.
– ప్లాన్-ఏలో 18 శాతం వార్షిక లాభం
– ప్లాన్-బీలో 30 శాతం
– ప్లాన్-సీలో 48 శాతం వరకు రాబడి వస్తుందని హామీ ఇచ్చారు.
అంతేకాదు రూ.12.50 లక్షలు పెట్టుబడి పెడితే 5 గుంటల భూమి రిజిస్ట్రేషన్‌తో పాటు 24 శాతం లాభం ఇస్తామని నమ్మించారు. ప్రారంభంలో కొంతకాలం లాభాలు చెల్లించడం ద్వారా మరింత మంది పెట్టుబడులు పెట్టేలా చేశారు.
ప్రకృతి వ్యవసాయం పేరుతో మరో మోసం
కిసాన్ పరివార్ లిమిటెడ్ పేరుతో రైతుల భూములను సమీకరించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని ప్రచారం చేశారు. వ్యవసాయ ప్రాజెక్టులు, భూముల అభివృద్ధి, భవిష్యత్ లాభాల పేరుతో వందలాది మంది నుంచి భారీ మొత్తాలు వసూలు చేశారు.
చాలామంది తమ బంగారం, పొలాలు అమ్మి కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టినట్లు బాధితులు చెబుతున్నారు.
చెల్లింపులు నిలిపివేత… బాధితుల ఫిర్యాదులు
గత ఏడాది సెప్టెంబర్ వరకు పెట్టుబడిదారులకు లాభాలు చెల్లించిన సంస్థలు అనంతరం చెల్లింపులు పూర్తిగా నిలిపివేశాయి. డబ్బులు అడిగిన వారికి కొంత ఆలస్యమవుతుందని చెబుతూ చివరకు కార్యాలయాలను మూసివేసి అందుబాటులో లేకుండా పోయారు.
దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఈవోడబ్ల్యూ కేసు… గుజరాత్లో అరెస్ట్
మోకిలకు చెందిన విశ్రాంత నేవీ అధికారి సంజీవ్ గుప్తాతో పాటు మరో 10 మంది రూ.4.51 కోట్ల పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో జూన్ 15న కేసు నమోదైంది.
దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతుండటంతో భూపాల్ నాయక్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లే ప్రయత్నంలో గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సైబరాబాద్ పోలీసులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.
డోర్నకల్‌లో రాజకీయ ప్రచారం… సామాజిక సేవ పేరుతో గుర్తింపు
భూపాల్ నాయక్ పేరు మహబూబాబాద్ జిల్లాలో కొత్తది కాదు. కిసాన్ పరివార్ పేరుతో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించాడు. గ్రామాల్లో బోర్లు తవ్వించడం, విద్యార్థులకు బస్‌పాస్‌లు, ల్యాప్‌టాప్‌లు, బైక్‌లు పంపిణీ చేయడం, ఆర్థిక సహాయాలు అందించడం వంటి కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు పొందాడు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డోర్నకల్ ఎస్టీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ స్క్రూటినీలోనే తిరస్కరణకు గురైంది.
ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు చేస్తూ రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన భూపాల్ నాయక్ ఇప్పుడు భారీ పెట్టుబడి మోసం కేసులో అరెస్టు కావడం జిల్లాలో సంచలనంగా మారింది.
భూపాల్ నాయక్‌కు అనేక రూపాలు… మోసం చేయడంలోనూ అనేక ఎత్తుగడలు..!
షేర్ మార్కెట్ నిపుణుడిగా…
వ్యవసాయ వ్యాపారవేత్తగా…
ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకుడిగా…
సామాజిక సేవకుడిగా…
రాజకీయ నాయకుడిగా…
పెట్టుబడిదారులకు ఆర్థిక సలహాదారుగా…
ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కో రూపంలో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన భూపాల్ నాయక్, అదే నమ్మకాన్ని భారీ పెట్టుబడులుగా మార్చుకుని దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. హైటెక్ కార్యాలయాలు, భారీ లాభాల హామీలు, ప్రకృతి వ్యవసాయం పేరుతో భూముల ఆఫర్లు, సామాజిక సేవా కార్యక్రమాలు, రాజకీయ ప్రచారం, గ్రామస్థాయి ఏజెంట్ల నియామకం వంటి అనేక ఎత్తుగడలతో ప్రజలను ఆకర్షించి కోట్ల రూపాయల పెట్టుబడులు సేకరించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వస్తోంది.
మహబూబాబాద్ జిల్లాలో సామాజిక సేవకుడిగా, రైతు సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తిగా, యువతకు అండగా నిలిచే నాయకుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న భూపాల్ నాయక్, మరోవైపు అధిక లాభాల ఆశ చూపించి పెట్టుబడిదారులను ఆకర్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రారంభంలో కొంతకాలం లాభాలు చెల్లించి విశ్వాసం పెంచి, ఆ తర్వాత చెల్లింపులు నిలిపివేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ కేసులో భూపాల్ నాయక్‌తో పాటు మరికొందరి పాత్రపై కూడా సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితుల సంఖ్య, మోసపోయిన మొత్తం మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
_శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



