రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు!
పెండింగ్ బిల్లుల చెల్లింపునకు లంచం డిమాండ్ మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడల శాఖలో ఏసీబీ దాడులు

హైదరాబాద్, నవంబర్ 6 | నిజం న్యూస్;
మహబూబ్‌నగర్ జిల్లాలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝళిపించారు. రూ.3.10 లక్షల క్యాటరింగ్ బిల్లు చెల్లింపునకు రూ.లక్ష లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న జిల్లా యువజన, క్రీడల అధికారి, కాంట్రాక్టు టైపిస్ట్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన నవంబర్ 5, గురువారం చోటుచేసుకుంది.
ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడల అధికారిగా పనిచేస్తున్న జక్కు రాజశేఖర్‌రెడ్డి (ఏ1), అదే కార్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన టైపిస్ట్‌గా పనిచేస్తున్న గోరె ఉమేష్ (ఏ2) కలిసి ఫిర్యాదుదారుడిని రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. సాట్జ్ వాలీబాల్ హాస్టల్లో ఉంటున్న క్రీడాకారులకు 2026 ఆగస్టు నెలలో భోజనం సరఫరా చేసినందుకు సంబంధించిన రూ.3,10,000 క్యాటరింగ్ బిల్లును ప్రాసెస్ చేసి, ఆమోదించి చెక్కు విడుదల చేయాలంటే లంచం ఇవ్వాలని కోరారు.
ఈ క్రమంలో గురువారం లంచం స్వీకరిస్తుండగా మహబూబ్‌నగర్ ఏసీబీ రేంజ్ అధికారులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. లంచం సొమ్ము రూ.లక్షను జిల్లా యువజన, క్రీడల అధికారి రాజశేఖర్‌రెడ్డి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. టైపిస్ట్ ఉమేష్ తరఫున రాజశేఖర్‌రెడ్డి ఆ మొత్తాన్ని స్వీకరించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఇద్దరూ పరస్పర అవగాహనతో లంచం సొమ్మును పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో,నిజం న్యూస్



