రూ.22 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పాలన అధికారి!
రెవెన్యూ రికార్డుల్లో పేరు సవరణకు లంచం డిమాండ్.. కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

హైదరాబాద్, అక్టోబర్ 29 | నిజం న్యూస్
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకునే అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు మరోసారి కొరడా ఝళిపించారు. రెవెన్యూ రికార్డుల్లో పేరు సవరణకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించేందుకు లంచం డిమాండ్ చేసి, చివరకు రూ.22 వేల నగదు తీసుకుంటూ ఓ గ్రామ పాలన అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. మంచిర్యాల జిల్లాలోని మొసమ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. మొసమ్ గ్రామానికి చెందిన గ్రామ పాలన అధికారి డి. శ్రీనివాస్ ఫిర్యాదుదారుడి తండ్రి పేరును రెవెన్యూ రికార్డుల్లో సరిచేసేందుకు అవసరమైన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించే విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ సవరణ ద్వారా ఫిర్యాదుదారుడు, అతని సోదరుడు వ్యవసాయ భూమికి సంబంధించిన వారసత్వ హక్కులు పొందేందుకు అవకాశం ఉండటంతో అధికారి డబ్బులు అడిగినట్లు ఏసీబీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 29న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్ని, గ్రామ పాలన అధికారి కార్యాలయంలోనే రూ.22 వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
అధికారిక పదవిని దుర్వినియోగం చేసి అక్రమంగా లంచం స్వీకరించినందుకు సదరు అధికారిని అరెస్టు చేసి, కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కేసుల న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ స్పష్టం చేసింది.
లంచం అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా సమాచారం అందించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ వెల్లడించింది.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో నిజం న్యూస్



