అధ్వానంగా మారిన మానుకోట జిల్లా ఆశ్రమ పాఠశాలలు..
విద్యార్థులను ఇళ్లకు పంపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి

మహబూబాబాద్, ఆగస్టు 12, నిజం న్యూస్: మానుకోట జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల పరిస్థితులు అధ్వానంగా మారాయని, విద్యార్థుల భవిష్యత్తుతో అధికారులు చెలగాటమాడుతున్నారని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ ఆరోపించారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, భోజన వసతులు, మెనూ అమలు, పేరెంట్స్ కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
రెడ్యాల గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను బోడ రమేష్ నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో 360 మంది విద్యార్థులకు గాను కేవలం 120 మంది మాత్రమే హాజరైనట్లు గుర్తించామని తెలిపారు. అదేవిధంగా రెండు రోజుల క్రితం సీతానగారం ఆశ్రమ బాలుర పాఠశాలలో 380 మంది విద్యార్థులకు గాను కేవలం 60 మంది మాత్రమే పాఠశాలలో ఉన్నారని ఆరోపించారు.
కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులను వారి ఇళ్లకు పంపిస్తున్నారని, మైనర్లైన విద్యార్థులు పాఠశాలలో లేకపోయినా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సంతకాలతో సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశం ఉన్నప్పటికీ విద్యార్థులను ఇళ్లకు పంపించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ పరిస్థితి గత వారం రోజులుగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
విద్యార్థులు పాఠశాలలో లేకపోవడంతో ఆ రోజులకు సంబంధించిన మెనూ ఖర్చులు మిగిలిపోతాయని, వాటిని అధికారులు, హెడ్మాస్టర్లు, హాస్టల్ వార్డెన్లు వాటాలుగా పంచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని బోడ రమేష్ నాయక్ అన్నారు. అయితే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు.
అనేక ఆశ్రమ పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, పాఠశాలల్లో మెనూ బోర్డులు కూడా కనిపించడం లేదని ఆరోపించారు. రెడ్యాల, సీతానగరం పాఠశాలలకే పరిమితం కాకుండా జిల్లాలోని సుమారు 35 ఆశ్రమ పాఠశాలలు, స్పెషల్ హాస్టళ్లలోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క పాఠశాలలోనూ పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు.
ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం నిధులు కేటాయిస్తున్నప్పటికీ, వాటి ప్రయోజనం విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందడం లేదని బోడ రమేష్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్య, భవిష్యత్తు కంటే ఇతర ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శులు, ఐటీడీఏ పీవోలు వెంటనే స్పందించి మానుకోట జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలపై రాష్ట్ర స్థాయి అధికారులతో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ తరఫున బోడ రమేష్ నాయక్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో విద్య, వసతి, భోజన సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



