ఆగస్టు 15న ల్యామినేటెడ్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం

ఆగస్టు 15న ఈ కార్యక్రమానికి అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ల్యామినేటెడ్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ.. 1.05 కోట్ల కుటుంబాలకు కొత్త కార్డులు

హైదరాబాద్, ఆగస్టు 7 (నిజం న్యూస్): తెలంగాణలో అర్హులైన పేద ప్రజలకు మరింత పారదర్శకంగా రేషన్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు కొత్త ల్యామినేటెడ్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ కార్యక్రమానికి అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ల్యామినేటెడ్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

అదే సమయంలో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ఏకకాలంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల కుటుంబాలకు కొత్త ల్యామినేటెడ్ రేషన్ కార్డులను అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు..

ఆగస్టు 15న ఉదయం అధికారిక జాతీయ వేడుకలు, సాయంత్రం 5:30 గంటలకు రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ఉండటంతో రేషన్ కార్డుల పంపిణీని మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నిర్వహించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.

పంపిణీ కార్యక్రమం పూర్తయిన వెంటనే నియోజకవర్గాల వారీగా పంపిణీ చేసిన రేషన్ కార్డుల సంఖ్య, కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, పూర్తి నివేదికను ప్రభుత్వానికి తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు.

కొత్త ల్యామినేటెడ్ రేషన్ కార్డుల పంపిణీతో లబ్ధిదారులకు మరింత సౌకర్యం కలగడంతో పాటు రేషన్ సేవల్లో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

_శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో,నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button