కర్ణాటకలో సంచలనం.. 7 వేల మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్..
కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2.60 లక్షల మంది హెచ్ఐవీతో జీవిస్తున్నారు. వీరిలో దాదాపు 54 వేల మందికి తమకు వైరస్ సోకిన విషయం తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతలో హెచ్ఐవీ వ్యాప్తి ఎక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

కళాశాలల్లో హెచ్ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్ తప్పనిసరి
నిజం న్యూస్ | బెంగళూరు | 28-07-2026
కర్ణాటక ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హెచ్ఐవీ (HIV) పరీక్షలు, కౌన్సెలింగ్‌ను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యువతలో వేగంగా పెరుగుతున్న హెచ్ఐవీ వ్యాప్తిని అరికట్టడం, విద్యార్థుల్లో అవగాహన పెంచడం, వ్యాధిని ముందస్తుగా గుర్తించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2.60 లక్షల మంది హెచ్ఐవీతో జీవిస్తున్నారు. వీరిలో దాదాపు 54 వేల మందికి తమకు వైరస్ సోకిన విషయం తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతలో హెచ్ఐవీ వ్యాప్తి ఎక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల 7 వేల మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. కళాశాల దశలోనే యువత ఈ వ్యాధి బారిన పడుతుండటంతో నివారణ చర్యలను మరింత పటిష్ఠం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, వృత్తి విద్యా కళాశాలల్లో క్రమం తప్పకుండా హెచ్ఐవీ పరీక్షలు, నిపుణులతో కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హెచ్ఐవీ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి చెందే మార్గాలు, నివారణ చర్యలు, సురక్షిత జీవన విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించి, బాధితులకు సకాలంలో చికిత్స అందించడంతో పాటు హెచ్ఐవీ వ్యాప్తిని నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



