ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్‌తో కొత్త మలుపు
'నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం'.. డిజిటల్ ఆధారాలు ఉన్నాయంటూ లేఖలో ప్రస్తావన

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు.. సూసైడ్ నోట్‌గా భావిస్తున్న లేఖతో కొత్త మలుపు
‘నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం’.. డిజిటల్ ఆధారాలు ఉన్నాయంటూ లేఖలో ప్రస్తావన
హైదరాబాద్, జులై 20 (నిజం న్యూస్): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాతీయ పోలీస్ అకాడమీ (NPA) ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ముందు రాసినట్లు భావిస్తున్న సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. లేఖలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తావించిన అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణను వేగవంతం చేశారు.
ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు సమాచారం.
సూసైడ్ నోట్లో తనపై నమోదైన లైంగిక వేధింపుల ఫిర్యాదులు పూర్తిగా అవాస్తవమని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. తనకు ఒకే బ్యాచ్‌కు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారితో ఏడాది కాలంగా పరస్పర సమ్మతితో సంబంధం ఉన్నట్లు ఆయన లేఖలో వివరించినట్లు తెలుస్తోంది. ఆమె వివాహం అనంతరం కూడా ఆ సంబంధం కొనసాగిందని, ఆమె స్వచ్ఛందంగానే తన గదికి వచ్చేదని కూడా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
తమ మధ్య జరిగిన సంభాషణలు, వీడియోలు, ఇతర డిజిటల్ ఆధారాలు అన్నీ తన మొబైల్ ఫోన్లో భద్రంగా ఉన్నాయని, నిజానిజాలు వెలుగులోకి రావాలంటే వాటిని పరిశీలించాలని ఆయన లేఖలో కోరినట్లు సమాచారం. అంతేకాకుండా, తమ సంబంధం గురించి సదరు మహిళా అధికారి భర్తకు కూడా తానే స్వయంగా వివరించినట్లు లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
అలాగే తనకు జరిగిన పరిణామాలకు నలుగురు వ్యక్తులు కారణమని ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపించినట్లు సమాచారం. అయితే వారి పేర్లపై పోలీసులు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. లేఖలోని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ, సంబంధిత వ్యక్తుల పాత్రపై విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో భాగంగా పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌తో పాటు ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు సమాచారం. సూసైడ్ నోట్ అసలుదనాన్ని కూడా నిపుణుల ద్వారా పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, చాట్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ కేసులో నమోదైన లైంగిక వేధింపుల ఫిర్యాదు, అనంతరం జరిగిన ఆత్మహత్యాయత్నం, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన సూసైడ్ నోట్ నేపథ్యంలో దర్యాప్తు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సూసైడ్ నోట్లోని ఆరోపణలు, వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన అంశాలు ఇప్పటివరకు అధికారికంగా దర్యాప్తు సంస్థల ద్వారా ధృవీకరించబడలేదు. అందువల్ల తుది విచారణ నివేదిక వెలువడే వరకు వాటిని ఆరోపణలుగానే పరిగణించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



