రైతు భరోసా’ నిధుల జమ వేళ కొత్త ట్విస్ట్.. ఇక వారికి మాత్రమే నిధులు..!
వానాకాలం సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈసారి నిధుల విడుదలతో పాటు అర్హతల విషయంలో కూడా కొత్త మార్గదర్శకాలు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్, జూన్ 23 (స్టేట్ బ్యూరో – నిజం న్యూస్):
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలులో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. వానాకాలం సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈసారి నిధుల విడుదలతో పాటు అర్హతల విషయంలో కూడా కొత్త మార్గదర్శకాలు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను సమీకరిస్తోంది. దాదాపు రూ.9 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేసే దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. గతంలో మాదిరిగా దశలవారీగా కాకుండా ఒకే విడతలో నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సుమారు 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
గత యాసంగి సీజన్‌లో రెండు ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయం అందించడంతో రైతుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులకు అధిక ప్రాధాన్యం కల్పించేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏడున్నర ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే పథకం వర్తింపజేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
అదేవిధంగా, కేవలం పట్టాదారు పాస్‌బుక్ ఉన్న వారికే కాకుండా వాస్తవంగా పంట సాగు చేస్తున్న రైతులకే రైతు భరోసా అందించాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శాటిలైట్ సర్వే నివేదికలను కీలకంగా పరిగణించే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు వివరాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఇటీవల శాటిలైట్ ఆధారిత సర్వే నిర్వహించింది. గ్రామాల వారీగా సాగు విస్తీర్ణం, పంటల స్థితిగతులను గుర్తించిన అధికారులు పైలట్ ప్రాజెక్టులో సానుకూల ఫలితాలు రావడంతో భవిష్యత్తులో ఇదే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఇక రైతు భరోసా నిధులను ఒకేసారి విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ, శాటిలైట్ సర్వే ఆధారంగా అర్హుల ఎంపిక జరగనుండటంతో చివరికి ఎవరి ఖాతాల్లో నిధులు జమ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు వెలువడిన తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
_శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



