తెలంగాణలో 93 వేల పెన్షన్లకు కత్తెర.. జూలై నుంచి కొత్త లబ్ధిదారుల ఎంపిక
రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వహిస్తున్న ప్రత్యేక సర్వేలో ఇప్పటివరకు 93,624 మంది అనర్హ లబ్ధిదారులను గుర్తించింది. వీరిని జాబితా నుంచి తొలగించి, అర్హులైన కొత్త దరఖాస్తుదారులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

హైదరాబాద్, జూన్ 23 (స్టేట్ బ్యూరో, నిజం న్యూస్): తెలంగాణలో చేయూత పెన్షన్ల ప్రక్షాళన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వహిస్తున్న ప్రత్యేక సర్వేలో ఇప్పటివరకు 93,624 మంది అనర్హ లబ్ధిదారులను గుర్తించింది. వీరిని జాబితా నుంచి తొలగించి, అర్హులైన కొత్త దరఖాస్తుదారులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
సెర్ప్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సర్వేలో బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న సుమారు 19 లక్షల మంది లబ్ధిదారుల్లో ఇప్పటికే 16 లక్షల మందికి పైగా వివరాలను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల్లో వేలాది మంది అనర్హులుగా తేలడంతో ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు వేగవంతం చేసింది.
అనర్హుల గుర్తింపులో సంచలన విషయాలు
సర్వేలో వెలుగులోకి వచ్చిన వివరాలు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. అనర్హులుగా గుర్తించిన వారిలో 40,751 మంది ఇప్పటికే మరణించినట్లు తేలింది. అయినప్పటికీ వారి పేర్లపై పెన్షన్లు కొనసాగుతున్నట్లు గుర్తించారు. మరో 41,689 మంది తమ నమోదిత చిరునామాల్లో నివసించడం లేదని, వారి ఆచూకీ లభించలేదని అధికారులు వెల్లడించారు.
అలాగే 11,184 మంది ఆధార్ వివరాల్లో లోపాలు ఉన్నట్లు, 3,475 మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లినట్లు గుర్తించారు. గ్రామ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి లైవ్ అథెంటికేషన్ నిర్వహిస్తున్నారు.
జూలై నుంచి కొత్త పెన్షన్ల మంజూరు
ఈ నెలాఖరుతో సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం అనర్హుల తొలగింపు పూర్తి చేసి, జూలై మొదటి వారం నుంచి కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నారు.
ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు సహా అనేక మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వం త్వరలో కొత్త లబ్ధిదారుల జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ద్వారా నిజమైన అర్హులకు సకాలంలో పెన్షన్లు అందే మార్గం సుగమం కానుంది.
– శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



