రైతు భరోసా పథకంలో భారీ మార్పుల దిశగా ప్రభుత్వం

అర్హతల సవరణతో కొత్త విధానం అమలు అవకాశం

స్టేట్ బ్యూరో,నిజం న్యూస్, హైదరాబాద్, 22 జూన్ 2026: తెలంగాణ

తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నేపథ్యంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విడతలో సుమారు 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ. 9,000 కోట్లను జమ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.

గత యాసంగి సీజన్‌లో రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందించడంతో వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా అన్ని వర్గాల రైతులకు ప్రయోజనం చేకూర్చేలా మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అవసరమైతే నిధుల విడుదలను విడతల వారీగా (మొదట ఎకరం చొప్పున) ప్రారంభించి, 9 రోజుల్లో పూర్తి చేయాలన్న ప్రత్యామ్నాయ ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప్రజల సొమ్ము వృథా కాకుండా నిజమైన సాగు రైతులకే లబ్ధి చేకూరేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో సుమారు 1.50 కోట్ల ఎకరాల భూమిలో సాగుకు పనికిరాని భూములు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, కాలువలు, కుంటలు, బీడు భూములు కలిపి 20 నుంచి 25 లక్షల ఎకరాలను రైతు భరోసా జాబితా నుంచి తొలగించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.

అదే విధంగా ధనవంతులైన పెద్ద రైతుల కంటే పేద, మధ్యతరగతి రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో 7.20 గుంటల వరకు భూమి ఉన్నవారికే సాయం పరిమితం చేయాలన్న ఆలోచన ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులను పథకం నుంచి మినహాయించే అవకాశమూ పరిశీలనలో ఉంది. అలాగే పత్తి వంటి పంటలు రబీలో సాగు తగ్గిన నేపథ్యంలో రైతు భరోసాను కేవలం ఖరీఫ్ సీజన్‌కే పరిమితం చేయాలా? అనే అంశంపైనా ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ఎన్నికల హామీ ప్రకారం ఎకరానికి రూ. 15 వేల సాయం అందిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కొందరు మంత్రులు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలుస్తోంది.

ఇకపై రైతు భరోసా పథకంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఆధునిక సాంకేతికతను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్‌కు చెందిన సార్ మ్యాప్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని శాటిలైట్ ఆధారిత సర్వే నిర్వహించారు.

ఈ సర్వే ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామంలో, ఏ సర్వే నంబర్‌లో ఏ పంట సాగు అవుతుందో దాదాపు 95 శాతం ఖచ్చితత్వంతో గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఏఈఓలతో క్షేత్రస్థాయి సర్వే చేయించగా, శాటిలైట్ డేటాతో దాదాపు సమాన ఫలితాలు వచ్చినట్లు సమాచారం.

దీంతో ఇకపై కేవలం నిజంగా సాగు చేసే రైతులకే ప్రభుత్వ పథకాలు అందేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో నష్టపరిహారం వేగంగా అందించేందుకు, విత్తనాలు-ఎరువుల పంపిణీ ముందస్తుగా ప్రణాళిక చేయడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడనుందని అధికారులు భావిస్తున్నారు.

మొత్తంగా ఈ మార్పులతో రైతు భరోసా పథకం మరింత పారదర్శకంగా మారి నిజమైన రైతులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

_శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో – నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button