ఫిన్‌లాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి.. 45 రోజులుగా మణిదీప్ ఆచూకీ మిస్టరీ

హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు.. కేంద్రం, భారత రాయబార కార్యాలయానికి నోటీసులు

హైదరాబాద్, జూన్ 20 (నిజం న్యూస్): ఉన్నత విద్య కోసం ఫిన్‌లాండ్ వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి గుజ్జా మణిదీప్ రెడ్డి గత 45 రోజులుగా అదృశ్యమవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వనస్థలిపురం వైదేహి నగర్‌కు చెందిన ముత్యం రెడ్డి, మర్ణత దంపతుల కుమారుడు మణిదీప్ రెడ్డి ఫిన్‌లాండ్‌లోని లాహ్టి నగరంలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ (అండర్‌గ్రాడ్యుయేట్) చదువుతున్నాడు. గత నెల మే 5వ తేదీ నుంచి అతనితో కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో ఈ వ్యవహారం మిస్టరీగా మారింది.

 

తల్లిదండ్రుల కథనం ప్రకారం, మే 5న తల్లితో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్ “బేకరీ వద్ద ఉన్నాను, కొద్దిసేపట్లో గదికి వెళ్తాను” అని చెప్పాడు. ఆ తర్వాత నుంచి అతని మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్‌లోనే ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫోన్ కాల్స్, మెసేజ్లు, సోషల్ మీడియా ద్వారా సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

 

మణిదీప్ స్నేహితులు, సహ విద్యార్థులు, యూనివర్సిటీ వర్గాలు, అతను నివసించే ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో ఫిన్‌లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేయించారు. అయినప్పటికీ దర్యాప్తులో ఆశించిన పురోగతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

 

అధికారుల స్పందన సంతృప్తికరంగా లేదని ఆరోపిస్తూ ముత్యం రెడ్డి, మర్ణత దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసు శాఖ, ఇతర సంబంధిత సంస్థలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

 

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, ఫిన్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసు శాఖ తదితర అధికారులకు నోటీసులు జారీ చేశారు. మణిదీప్‌ను గుర్తించేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.

 

కోర్టు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఫిన్‌లాండ్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పటికీ మణిదీప్ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల భద్రతపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. మణిదీప్ క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ప్రార్థిస్తున్నారు. 45 రోజులు గడిచినా ఎలాంటి స్పష్టమైన సమాచారం అందకపోవడం ఈ కేసును మరింత మిస్టరీగా మార్చింది.

 

— శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button