రైతులకు శుభవార్త.. జూన్ 20న ఖాతాల్లోకి రూ.2,000 జమ
వ్యవసాయ రంగానికి ఆర్థిక బలాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది

పీఎం కిసాన్ 23వ విడత నిధుల విడుదలకు కేంద్రం సిద్ధం
నిజం న్యూస్, న్యూఢిల్లీ, జూన్ 18:
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్థిక ఊరటనివ్వనుంది. ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద 23వ విడత నిధులను జూన్ 20న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విడతలో దేశంలోని 9 కోట్లకు పైగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,000 చొప్పున నేరుగా జమ కానున్నాయి.
వ్యవసాయ రంగానికి ఆర్థిక బలాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
ఈసారి విడుదలయ్యే 23వ విడత నిధులు రైతులకు ఖరీఫ్ సాగు పనుల సమయంలో ఎంతో ఉపయుక్తంగా మారనున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు వంటి వ్యవసాయ అవసరాలకు ఈ నిధులు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొంటున్నారు.
అయితే పథకం లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయడంతో పాటు ఆధార్‌ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసి ఉండాలి. భూ రికార్డుల ధృవీకరణ పూర్తికాని రైతులకు నిధులు జమ కావడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పీఎం కిసాన్ పథకం కింద తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో రైతులు అధికారిక పోర్టల్‌లో పరిశీలించుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



