ఆంధ్ర అమ్మాయికి తెలంగాణలో కళ్యాణ లక్ష్మి..?
కళ్యాణ లక్ష్మి పథకం కొంతమంది అవినీతి అధికారులు, దళారుల వల్ల అనర్హులకు దక్కుతుందన్న వివర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో కళ్యాణ లక్ష్మి పథకం అమలులో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి.

మేళ్లచెరువులో కళ్యాణ లక్ష్మి పథకంలో అక్రమాల ఆరోపణలు
– నకిలీ ధ్రువపత్రాలతో లబ్ధి పొందినట్లు విమర్శలు
మేళ్లచెరువు, మే 30, నిజం చెపుతాం:
పేద కుటుంబాలకు వివాహ సమయంలో ఇబ్బందులు కలగకుండా ఆ కుటుంబాలకు ఆసరాగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టింది.
అయితే ఈ కళ్యాణ లక్ష్మి పథకం కొంతమంది అవినీతి అధికారులు, దళారుల వల్ల అనర్హులకు దక్కుతుందన్న వివర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో కళ్యాణ లక్ష్మి పథకం అమలులో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం, కొందరి పలుకుబడి కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకం లబ్ధిని పొందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, ఎన్టీఆర్ జిల్లా బూదాడ గ్రామానికి చెందిన ఓ యువతికి 2023 మే 12న మేళ్లచెరువు మండలానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. అయితే వివాహానికి ముందే ఆ యువతిని మేళ్లచెరువు మండలంలో జన్మించినట్లుగా చూపిస్తూ ఆదాయ, కుల ధ్రువపత్రాలను పొందారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ధ్రువపత్రాల ఆధారంగా 2023 మే 4న తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసి, అనంతరం పథకం కింద ఆర్థిక సాయం పొందినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి చెందని వ్యక్తికి స్థానిక ధ్రువపత్రాలు ఎలా జారీ అయ్యాయి? అర్హతల పరిశీలన లేకుండానే దరఖాస్తు ఎలా ఆమోదం పొందింది? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
పేద తెలంగాణ కుటుంబాలకు అందాల్సిన సంక్షేమ నిధులు అక్రమ మార్గాల్లో ఇతరులకు చేరుతున్నాయనే ఆరోపణలు స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిజంగా నకిలీ ధ్రువపత్రాల ఆధారంగా పథకం లబ్ధి పొందినట్లయితే అది ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడమే కాకుండా, అర్హులైన పేద కుటుంబాల హక్కులను హరించినట్లేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ధ్రువపత్రాల జారీ నుంచి పథకం మంజూరు వరకు జరిగిన ప్రక్రియను పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు రుజువైతే సంబంధిత లబ్ధిదారులతో పాటు బాధ్యులైన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
“తెలంగాణ పేదల కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలు అక్రమ మార్గాల్లో అనర్హులకు చేరితే, నిజమైన అర్హులకు న్యాయం ఎలా జరుగుతుంది?” అనే ప్రశ్న ఇప్పుడు మేళ్లచెరువు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.



