రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం.. 2.5 లక్షల ఇళ్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్

జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

హైదరాబాద్, మే 24 (నిజం న్యూస్): శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లతో పాటు పలు కీలక అంశాలకు ఆమోదముద్ర పడింది.

రాష్ట్రంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది.

జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ నగర కోర్ పట్టణ ప్రాంతంలోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో కూడా 1 లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రిమండలి తీర్మానించింది. ఈ ప్రాంతంలో ఇంటి స్థలం ఉన్న వారు తక్కువగా ఉన్నందున నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే స్థలాలను గుర్తించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో 15 వేల కుటుంబాలు పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నట్టు వివిధ సర్వేల్లో వెల్లడైన నేపథ్యంలో, ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందించాలని మంత్రిమండలి తీర్మానించింది.

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి  వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.

2027లో ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనుల కోసం రూ.1000 కోట్లను కేటాయించింది.

విద్యుత్ పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకంలో చేరేందుకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు తయారు చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ, పునరావాసం, మౌలిక వసతుల కల్పనకు మంత్రివర్గం రూ.587 కోట్లను కేటాయించింది.

రాష్ట్రంలోని అన్ని జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలను మార్క్‌ఫెడ్‌లో, అలాగే గ్రామీణ మౌలిక వసతుల సంస్థను హాకాలో విలీనం చేయాలని మంత్రిమండలి తీర్మానించింది.

2030 నాటికి ప్రపంచంలోని తొలి 5 జీవ విజ్ఞాన కేంద్రాల్లో ఒకటిగా తెలంగాణను నిలబెట్టాలన్న సంకల్పంతో “తదుపరి తరం జీవ విజ్ఞాన విధానం 2026–30”కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దావోస్ పర్యటన సందర్భంగా ఈ విధానాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రకటించారు.

వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతో పాటు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా విధానం రూపకల్పన జరిగింది. జీవ విజ్ఞానం, ఔషధ తయారీ, జీవసాంకేతికత, వైద్య ఆవిష్కరణ రంగాల్లో భారీ పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చే దిశగా ఈ విధానాన్ని రూపొందించారు.

యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్ ఆరోగ్యం, ప్రపంచ ఆవిష్కరణ రంగాల్లో మంచి అవకాశాలు కల్పించాలని, ఇప్పటివరకు ఎక్కువగా తయారీ రంగంపైనే దృష్టి ఉండగా, ఇక నుంచి ఆవిష్కరణ, పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగాలను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా విధానంలో మార్పులు తీసుకురావాలని మంత్రిమండలి నిర్ణయించింది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button