హుజూర్‌నగర్‌లో అక్రమ ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌ల విచ్చలవిడి దందా..!

ప్రవేట్ ఆసుపత్రులతో పాటు, పసరకట్టు వైద్యశాలలకు వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు శూన్యం..!

హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రైవేట్ ఆస్పత్రుల తీరు కాసుల కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయని నియోజకవర్గ కేంద్రంలో వెలుస్తున్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు నిబంధనలను తుంగలో తొక్కి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వారికి క్వాలిఫికేషన్‌ లేకపోయినా కూడా వైద్యం చేయడం ఇక్కడ బహిరంగ రహస్యంగా మారింది.

అర్హత లేకున్నా అరాచకమే..!

నియోజకవర్గంలోని పలు ఆసుపత్రుల్లో బోర్డులపై ఉన్న అర్హతలకు, లోపల అందుతున్న వైద్యానికి పొంతన ఉండటం లేదు. డిగ్రీలు ఉన్న వారు సైతం స్పెషలిస్ట్ డాక్టర్ల అవతారమెత్తి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరికొన్ని చోట్ల కనీస విద్యార్హత లేని వారు కూడా ‘డాక్టర్’ బోర్డులు తగిలించుకుని గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ, పరిస్థితి విషమిస్తే చేతులెత్తేస్తూ రోగులను మృత్యువు అంచుల్లోకి నెడుతున్నారు.

పిర్యాదులు పట్టించుకోరా..?

వైద్యశాలల అనుమతులు, అక్కడ జరుగుతున్న అక్రమాలపై గతంలోనే అనేకసార్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులకు ఫిర్యాదులు అందాయి. నిబంధనల ప్రకారం అనుమతులు లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ, నేటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే నకిలీ వైద్యులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వైద్యశాఖ అధికారుల చర్యలు ఎప్పుడో..?

నియోజకవర్గంలో కొన్ని ప్రవేట్ ఆసుపత్రులతోపాటు, పసరకట్టు వైద్యశాలలకు వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు లేవని పసరకట్టు వైద్యశాలల దందాపై జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, హుజూర్ నగర్‌లోని పసరకట్టు,ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని స్థానికుల కోరుతున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button