వెలుగు లేని ఆసుపత్రిలో వ్యాక్సిన్ల భద్రత ప్రశ్నార్థకం..!

ఒకే సమయంలో రెండు చోట్ల సేవలు అందించడం వైద్యులకు కత్తిమీద సాములా మారింది.

మండల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన మఠంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ప్రస్తుతం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. అరకొర సిబ్బంది, మౌలిక సదుపాయాల లేమితో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గత నాలుగు నెలలుగా రెగ్యులర్ ఫార్మసిస్టు లేకపోవడంతో, వైద్యులు రాసిన మందులను ఇతర విభాగాల సిబ్బంది పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అటు సిబ్బందిపై అదనపు భారం పెంచడమే కాకుండా, రోగులకు సరైన సమయంలో మందులు అందడంలో జాప్యం జరుగుతోంది.

వ్యాక్సిన్లకు కరెంట్ కష్టాలు..!

ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిరంతరం అంతరాయం కలుగుతుండటంతో విలువైన వ్యాక్సిన్లు పాడయ్యే ప్రమాదం ఉంది. అత్యవసర సమయంలో ఉపయోగపడాల్సిన ఇన్వెర్టర్ సైతం పనిచేయకపోవడంతో ఆసుపత్రి ప్రాంగణం అంధకారంలో మగ్గుతోంది. గర్భిణీలకు, బాలింతలకు ఇచ్చే టీకాలు, ఇతర మందుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

పల్లె దవాఖానాల్లోనూ అదే తీరు..!

యాతవాకిళ్ల గ్రామంలోని పల్లె దవాఖానా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేవలం ఇద్దరు ఏఎన్ఎంలతోనే నెట్టుకొస్తున్నారు. అక్కడ అత్యవసర కేసులు ఎదురైతే, మఠంపల్లి పీహెచ్‌సీ డాక్టర్ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ఒకే సమయంలో రెండు చోట్ల సేవలు అందించడం వైద్యులకు కత్తిమీద సాములా మారింది.

రాత్రి వేళల్లో అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు ఇబ్బంది పడకుండా, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, ఆసుపత్రిలో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు, ఉన్నతాధికారులను కోరుతున్నారు.

అధికారి వివరణ..!

ఈ విషయమై ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణిని వివరణ కోరగా.. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని సూర్యాపేట జిల్లా డిఎంహెచ్వో (DMHO) కు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ఫార్మసిస్టును తక్షణమే నియమించాలని ఇప్పటికే నివేదిక సమర్పించినట్లు తెలిపారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button