ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైల్ దాడి: పెటా టిక్వాలో భారీ నష్టం..!
కూలిన మిస్సైల్ ముక్కలు జనావాసాలపై పడటంతో ఆస్తి నష్టం మరింత పెరిగింది..!

మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకున్నాయి. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌పై జరిగిన భారీ మిస్సైల్ దాడులు తీవ్ర కలకలం రేపాయి. ఈ దాడుల ప్రభావం కేంద్ర ఇజ్రాయెల్‌లోని పెటా టిక్వా నగరంపై తీవ్రంగా పడింది.
పెటా టిక్వాలోని పలు నివాస భవనాలు ఈ మిస్సైల్ దాడుల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుళ్ల తీవ్రతకు భవనాల కిటికీలు, గోడలు కూలిపోయాయి.మిస్సైళ్లు పడిన వెంటనే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా అగ్నిప్రమాదాలు సంభవించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఆకస్మికంగా జరిగిన ఈ భారీ పేలుళ్లతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సాక్షుల కథనం ప్రకారం, ఆకాశం నుంచి నిప్పులు కురిసినట్లుగా మిస్సైల్ శకలాలు పడటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.క్షిపణి నిరోధక వ్యవస్థలు కొన్నిటిని అడ్డుకున్నప్పటికీ, కూలిన మిస్సైల్ ముక్కలు జనావాసాలపై పడటంతో ఆస్తి నష్టం మరింత పెరిగింది.ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.



