బాల కార్మికులు లేని వ్యవస్థ నిర్మాణం ఓ..ఎండమావేనా?
బాల కార్మిక (నిషేధం, నియంత్రణా )చట్టం_ 1986: ఈ చట్టం 2016 లో వచ్చిన సవరణలతో కలుపుకుంటే,ఈ చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు గల బాల బాలికలెవరైనా,బాల కార్మికులుగా కళలు, సినిమా పరిశ్రమలు, గనులు, ఫ్యాక్టరీలు, భవన నిర్మాణాలు,హోటళ్ళు, ఇటుక బట్టీలు లాంటి పనుల్లో చేర్చుకున్న యాజమాన్యానికి ఈ చట్టం ప్రకారం ఆరు నుండి రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష లేదా 20 వేల నుండి 50 వేల వరకు జరిమానా, లేదా రెండు కూడా విధించే అవకాశాలున్నాయి.

ప్రపంచ దేశాలతో పోలిస్తే, అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం అయితే అందులో యువ జనాభా కూడా ఎక్కువ శాతముండటం అది మన దేశం చేసుకున్న ఓ అదృష్టం.ఈ మానవ సంపదను లేదా మానవ వనరులను వినియోగించుకోవడం ద్వారా మన దేశం నాణ్యతతో కూడిన సత్వరాభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పాలకుల చిత్తశుద్ధి, సంకల్పబలం,ఆచరణాత్మక క్రియాశీలత తోడైతే ఆశించిన ఫలితాలు సాధ్యమే. అందుచేత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవ వనరులకు చైతన్య పరచి, పని చేయడానికి కావలసినటువంటి పని నైపుణ్యాన్ని వాళ్లలో పెంచగలిగితే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా త్వరలో రూపాంతరం చెందుతుందనుటలో సందేహం లేదు.ఆ దిశగా కొంగొత్త అడుగులు పడాలని దానికి విలువైన దారులు వెతకాలని ఆశిద్దాం!
ఆరు నుండి రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష…
బాల కార్మిక (నిషేధం, నియంత్రణా )చట్టం_ 1986: ఈ చట్టం 2016 లో వచ్చిన సవరణలతో కలుపుకుంటే, ఈ చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు గల బాల బాలికలెవరైనా,బాల కార్మికులుగా కళలు, సినిమా పరిశ్రమలు, గనులు, ఫ్యాక్టరీలు, భవన నిర్మాణాలు,హోటళ్ళు, ఇటుక బట్టీలు లాంటి పనుల్లో చేర్చుకున్న యాజమాన్యానికి ఈ చట్టం ప్రకారం ఆరు నుండి రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష లేదా 20 వేల నుండి 50 వేల వరకు జరిమానా, లేదా రెండు కూడా విధించే అవకాశాలున్నాయి.
ఇంత పకడ్బందీ చట్టం ఉన్నప్పటికీ అనుకూలమైన ఫలితాలు ఇంకా రావటం లేదు. కేవలం చట్టం రూపొందిస్తే సరిపోదు. అందుకు తోడుగా ప్రభావవంతమైన కార్యాచరణ కూడా ఎంతో ముఖ్యం. అందుచేత మరీ ముఖ్యంగా ఈ చట్టంపై అవగాహన ఉన్న యాజమాన్యం బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించటమంటే, తమ తమ కార్ఖానాలలో బాలలను పనిచేయించుకోవడం ద్వారా ఒనగూరే నష్టంపై మరింత లోతుగా అధ్యయనం చేయాలి.అంతకుమించి సంపూర్ణ అవగాహన కలిగియుండాలి. వారికి చేతనైనంతలో సమాజానికి చేయూతనందించాలి.
కర్మాగారాలలో ప్రమాదకరమైన పనులకు నియమించొద్దు…
రాజ్యాంగ నిబంధన:మన భారత రాజ్యాంగం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు గాను రాజ్యాంగంలోని అధికరణం 24 ప్రకారం బాల కార్మికులను కర్మాగారాలలో ప్రమాదకరమైనటువంటి పనులను చేయించడాన్ని పూర్తిగా నిషేధించింది.
ఆ దిశగా బాలల భవితవ్యానికి చక్కటి భరోసాను సైతం ఇచ్చింది.
మినహాయింపు..
14 సంవత్సరాల లోపు బాల బాలికలు తమ కుటుంబ అవసరాల కోసం వారి పెద్దల ఆదేశాలతో కుటుంబ పనులలో సహాయం చేయడం అది కూడా పాఠశాల పని గంటల్లో కాకుండా, పాఠశాలకు రాకముందు పాఠశాల పనిగంటలు ముగిసిన తర్వాతనే ఆ పనులలో సహాయకారిగా ఉండాలి.ఆ పనుల ద్వారా తన విద్యకు ఎలాంటి ఆటంకం కలుగరాదన్నదే ఇక్కడ ప్రధానాంశం.
ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం:
రాష్ట్ర ప్రభుత్వం ఈ 1జనవరి నుండి 31 జనవరి వరకు ఆపరేషన్ స్మైల్ పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించినది.ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వెల్ఫేర్ కమిటీ,కార్మిక శాఖ,విద్యాశాఖ,చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్,వైద్యశాఖతో పాటుగా ఎన్జీవో సంఘాల సహకారంతో ఎక్కడైతే, బాలలు బాలకార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడటం, వారికి విద్యావకాశాలు కల్పించడంలో మరింత తోడ్పాటునందించడం, అవసరమైతే వారిని ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో చేర్పించే బాధ్యత కూడా ఈ ప్రోగ్రాంలో అంతర్భాగంగా చేర్చారు.
పిల్లల ఉజ్వల భవితవ్యానికి సమాజం భరోసా:
చిన్నపిల్లల చేతుల్లో ఇటుకలు ఉండరాదనీ,వాళ్ల చేతుల్లో పెన్సిల్ ఉండాలనీ, పిల్లలు తప్పనిసరిగా చదువు బడిలో చేరాలనీ,బాల కార్మిక వ్యవస్థను నిర్మూళన అనేది ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరంముంది.వారి చేతుల్లో హలం కాదు కలం ఉండాలి.అప్పుడే వారికి భవిష్యత్తుకు బలముంటుంది.ఇలాంటి భరోసాను సమాజం యావత్తూ ఇవ్వాల్సిన చారిత్రక అవసరం ఉందన్నది మరువలేని ఓ చారిత్రక నగ్న సత్యం.
తల్లిదండ్రులదీ ప్రధాన బాధ్యత:
ప్రధానంగా నిరక్షరాస్యత గల తల్లిదండ్రులు నేటి ఆధునిక సమాజం యొక్క పోకడలను గమనించాలి.అలాగే చదువుకోకపోవడం వల్ల తమ వ్యక్తిగత జీవనంలో పడినటువంటి ఆటుపోట్లను ఆ అనుభవ సారాన్ని మేళవించి ఆ అనుభవసారంతో చదువు యొక్క విలువను గ్రహించి కనీసం తమ యొక్క సంతానాన్ని చదువుకోవడానికి విస్తృతమైన రీతిలో వున్న చక్కటి అవకాశాలను, ప్రభుత్వం ఇచ్చేటువంటి,ప్రోత్సాహక సదుపాయాలను సద్వినియోగపరచుకొని వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం ఒక మానవీయమైన సామాజిక బాధ్యతగా ప్రతి తల్లి,తండ్రి గమనంలోకి తీసుకోవాలి. అప్పుడే వ్యక్తిగత కుటుంబంతో పాటుగా సామాజికాభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధికి మార్గం సుగమమవుతుంది
వ్యాసకర్త:
పరాoకుశం రఘు నారాయణ
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
గ్రామం:తొర్రూరు
మహబూబాబాద్ జిల్లా
చరవాణి:9949749987



