టీచర్లు తినని భోజనం పిల్లలకు ఎందుకు..?

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం (లంచ్) అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఉపాధ్యాయ సంఘాల వైఖరిపై తలెత్తుతున్న ప్రశ్నలు

 

హైదరాబాద్, జూలై 4 (నిజం న్యూస్):

 

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం (లంచ్) అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఉపాధ్యాయుల భోజనానికి వెచ్చించే నిధులను విద్యార్థులకే కేటాయించి వారికి మరింత నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

 

పైకి చూస్తే ఇది విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల ప్రేమగా, త్యాగంగా కనిపించవచ్చు. అయితే లోతుగా పరిశీలిస్తే సామాన్యుల మదిలో కొన్ని సమాధానం లేని ప్రశ్నలు మెదులుతున్నాయి.

 

టీచర్లు ఆ భోజనం ఎందుకు తినలేరు..?

 

నిజంగా ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం తమ భోజనాన్ని త్యాగం చేస్తున్నారా..? లేక ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న భోజనం నాణ్యతపై వారికి కూడా సందేహాలున్నాయా..? అనే చర్చ మొదలైంది.

 

రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో వండే అన్నంలో పురుగులు ఉన్నాయని, పప్పు నీళ్లలా ఉంటోందని, గుడ్లు సరిగా ఉడకడం లేదని, కూరల్లో పరిశుభ్రత లోపిస్తోందని గతంలో పలు సందర్భాల్లో వార్తలు వెలువడ్డాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఈ అంశాలపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

ఈ నేపథ్యంలో “మాకు భోజనం అవసరం లేదు.. ఆ నిధులు పిల్లలకే వాడండి” అని ఉపాధ్యాయ సంఘాలు చెప్పడం వెనుక నిజంగా విద్యార్థుల సంక్షేమమే ఉందా..? లేక తాము కూడా అదే భోజనం తినాల్సి వస్తుందనే ఆలోచన ఉందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

టీచర్లు తింటేనే కదా నాణ్యత పెరిగేది..!

 

ఒకవేళ ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి అదే భోజనం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..?

 

భోజనం నాణ్యత సహజంగానే మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. తాము కూడా అదే ఆహారం తీసుకోవాల్సి వస్తే బియ్యం నాణ్యత, వంటల పరిశుభ్రత, కూరల రుచి వంటి అంశాలపై ఉపాధ్యాయులే ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. నాణ్యత లోపిస్తే సంబంధిత ఏజెన్సీలను నిలదీసే అవకాశం కూడా ఉంటుంది.

 

అయితే ఉపాధ్యాయులు భోజనానికి దూరంగా ఉండటం వల్ల పర్యవేక్షణ తగ్గి, చివరకు నాసిరకం ఆహారాన్ని భరించాల్సి వస్తున్నది పేద విద్యార్థులేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

ప్రభుత్వ టీచర్ల నైతిక బాధ్యత ఏది..?

 

సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉండి, ప్రభుత్వ వేతనాలు పొందుతున్న ఉపాధ్యాయులకు విద్యార్థుల విద్యతో పాటు వారి ఆరోగ్యం పట్ల కూడా నైతిక బాధ్యత ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

“తాము తినలేని ఆహారాన్ని పిల్లలకు ఎలా అందిస్తారు..?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

 

ఉపాధ్యాయ సంఘాలు భోజన నిధుల పెంపు గురించి ప్రభుత్వాన్ని కోరడం సమంజసమే. అయితే అదే సమయంలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం ద్వారా ఆహార నాణ్యతను మెరుగుపరచడంలో భాగస్వాములు కావాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

భోజనాన్ని తిరస్కరించడం త్యాగంగా కనిపించినప్పటికీ, వాస్తవ పరిస్థితులను ఎదుర్కొని మార్పు తీసుకురావాల్సిన బాధ్యత నుంచి తప్పుకోవడంగా కూడా కొందరు విశ్లేషిస్తున్నారు.

 

పిల్లల కంచంలో ఉన్నదే టీచర్ కంచంలో కూడా ఉన్ననాడే… ప్రభుత్వ పాఠశాలల భోజన వ్యవస్థపై పూర్తి నమ్మకం ఏర్పడుతుందనేది సామాన్యుల అభిప్రాయం.

 

– శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button