వైద్యం.. వెక్కిరింత ..హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్తం..!

పనిచేయని మానిటర్లు.. వార్డు బాయ్స్ తోనే వైద్యం..!

హుజూర్ నగర్ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల వలయంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది కొరతతో వైద్యం అందక రోగులు అల్లాడుతుంటే. మరోవైపు అత్యవసర వైద్య పరికరాలు మూలను పడ్డాయి. ఇక్కడ అర్హత లేని వారితో వైద్యం చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

యంత్రాలు ఉన్నాయి.. కానీ పని చేయవు..!

ఆసుపత్రిలోని అత్యవసర వార్డు, పురుషుల, స్త్రీల వార్డులలో రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన మూడు పారా మానిటర్లు ప్రస్తుతం మూలన పడ్డాయి. సాంకేతిక లోపమో లేక పర్యవేక్షణ లోపమో కానీ, ఏ ఒక్కటీ పని చేయకపోవడంతో రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక విధుల్లో కేవలం నలుగురు వైద్య సిబ్బంది మాత్రమే ఉంటున్నట్లు సమాచారం. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. నిపుణులైన వైద్యులు, నర్సులు చేయాల్సిన ఇంజక్షన్లు, సెలైన్ బాటిల్స్ ఎక్కించే పనులను వార్డు బాయ్స్ తో చేయిస్తున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు.

వైద్యశాలలో వ్యాపార వాహనాల సందడి..!

ఆసుపత్రి ఆవరణలోని పార్కింగ్ స్థలం రోగుల కోసం కాకుండా బయటి వ్యాపారస్తుల వాహనాల కోసం కేటాయించినట్లుగా ఉంది. అడ్డదిడ్డంగా నిలుపుతున్న వాహనాల వల్ల అత్యవసర సమయంలో అంబులెన్స్ బయటకు వెళ్లాలన్నా కనీసం పది నిమిషాల సమయం వృధా అవుతోంది. ప్రమాద సమయంలో సెకన్ల కాలం విలువైనదైనప్పటికీ, పార్కింగ్ సమస్య వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సూర్యపేటకు పొమ్మనడమే పరిష్కారమా..?

రాత్రి వేళల్లో ఆసుపత్రికి వెళ్తే కనీసం చూసే నాథుడు ఉండటం లేదని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. అత్యవసర స్థితిలో క్షతగాత్రులను తీసుకువస్తే, కనీస చికిత్స అందించకుండా ‘సూర్యపేట వెళ్లండి’ లేదా ‘ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లండి’ అని వైద్యులు ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

వైద్యశాఖ అధికారులు స్పందించేది ఎప్పుడు..?

ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రిలోనే ప్రాణ భయం పట్టుకుంటే పేద ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, హుజూర్ నగర్ ఆసుపత్రిలో నెలకొన్న అవకతవకలపై విచారణ జరపాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button