జైలు బదిలీ అడ్డుకునేందుకు రూ.10 వేల లంచం..
సెప్టెంబర్ 7న సాయంత్రం సుమారు 5.45 గంటల సమయంలో హుజూరాబాద్‌లోని ఇండియన్ ఆయిల్ సబ్‌జైలు పెట్రోల్ బంక్ వద్ద లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు ట్రాప్ నిర్వహించారు. లంచం మొత్తాన్ని హరీష్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షల్లో అతని రెండు చేతుల వేళ్లకు పాజిటివ్ ఫలితం వచ్చినట్లు ఏసీబీ వెల్లడించింది.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ జైలర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్
హైదరాబాద్,సెప్టెంబర్ 8, 2026 | నిజం న్యూస్
హుజూరాబాద్: ఖైదీకి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో పాటు ములాఖత్‌లకు అవకాశం కల్పించడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూడడం కోసం రూ.10 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా హుజూరాబాద్ సబ్‌జైలు డిప్యూటీ జైలర్ నంపల్లి దేవేందర్, ఇండియన్ ఆయిల్ సబ్‌జైలు పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీష్‌లను ఏసీబీ అధికారులు సోమవారం (సెప్టెంబర్ 7) పట్టుకున్నారు.
ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్‌జైలులో డిప్యూటీ జైలర్‌గా పనిచేస్తున్న నంపల్లి దేవేందర్ (46), పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీష్ (30)లు ఫిర్యాదుదారుడి మామగారైన రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ములాఖత్‌లకు అనుమతించడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూడటం కోసం రూ.10,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.
సెప్టెంబర్ 7న సాయంత్రం సుమారు 5.45 గంటల సమయంలో హుజూరాబాద్‌లోని ఇండియన్ ఆయిల్ సబ్‌జైలు పెట్రోల్ బంక్ వద్ద లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు ట్రాప్ నిర్వహించారు. లంచం మొత్తాన్ని హరీష్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షల్లో అతని రెండు చేతుల వేళ్లకు పాజిటివ్ ఫలితం వచ్చినట్లు ఏసీబీ వెల్లడించింది.
ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కరీంనగర్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు.
లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించవచ్చు.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్