హుజూర్ నగర్ లో మట్టి, ఇసుక దందా
హుజూర్ నగర్ లోని రామస్వామి గట్టు వద్ద ఉన్న ప్రభుత్వ భూమి, దేవాలయ భూముల్లో గుట్టలను తవ్వుతూ వేపలసింగారం రోడ్ లోని ఒక రైస్ మిల్లుకు మట్టిని తరలిస్తున్న 4 టిప్పర్లను, ఒక ప్రొక్లయిన్ ,డోజర్ ను అధికారులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మట్టిదందాను ఆపాలని మైనింగ్ ఏడీకి ఫిర్యాదు
4 టిప్పర్లు, జెసీబీ, డోజర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
గత 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న మట్టి , ఇసుక దందా
హుజూర్ నగర్, జులై 8, నిజం చెపుతాం:
హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొందరు నాయకులు ఇసుక, మట్టిదందాను మొదలెట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు దందాను నడుపుతున్నా, పోలీసు, మైనింగ్ శాఖకు ఎన్ని ఫిర్యాదులు అందినా పట్టిించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో నాయకులు రెచ్చిపోయి గుట్టలను ఖాళీ చేస్తున్నారు. మట్టిదందాను ఆపాలని మైనింగ్ ఏడీకి బాణోతు మోతీలాల్ అనే వ్యక్తి బుధవారం ఫిర్యాదు చేయగా హుజూర్ నగర్ లోని రామస్వామి గట్టు వద్ద ఉన్న ప్రభుత్వ భూమి, దేవాలయ భూముల్లో గుట్టలను తవ్వుతూ వేపలసింగారం రోడ్ లోని ఒక రైస్ మిల్లుకు మట్టిని తరలిస్తున్న 4 టిప్పర్లను, ఒక ప్రొక్లయిన్ ,డోజర్ ను అధికారులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
గత 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న దందా…
హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గత 3 సంవత్సరాలుగా మట్టి దందా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. మట్టి లోడ్లు అధిక లోడ్ తో పోతుండటంతో రామస్వామి గట్టు వద్ద జీ ప్లస్ వన్ కాలనీకి వేసిన సీసీ రోడ్లు, హుజూర్ నగర్ లోని మొయిన్ రోడ్లు పగిలిపోయినట్లుగా తెలుస్తోంది. ఎవరైనా వీరిపై కంప్లైంయిట్ చేస్తే వారిపై దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎవరూ వీరి జోలికి వెళ్లడం లేదని పేరు చెప్పడానికి ఇష్టం లేని ఒక వ్యక్తి చెబుతున్నాడు.
దొరికినా వీరిపై కేసులుండవు…
2025 అగష్టు నెలలో హుజూర్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో 50 ట్రిప్పులు, వేపలసింగారంలోని ఎస్సీ కాలనీలో 50 ట్రిప్పుల ఇసుకను అక్రమంగా నిల్వ చేసారని ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు దాడులు చేసి ఇసుకను స్వాధీనం చేసుకుని గృహ నిర్మాణ శాఖకు అప్పజెప్పారు. కానీ అక్రమంగా ఇసుకను నిల్వ చేసిన వారిపై ఎలాంటి కేసులను నమోదు చేసినట్లు తెలియ రాలేదు. అలాగే ఇప్పడు కూడా జరిగే అవకాశం ఉందని వీరిపై ఎలాంటి కేసులు నమోదు అయ్యే అవకాశం లేదని పలువురు తెలుపుతున్నారు.
రోజుకు 2 లక్షల వరకు సంపాదన…
హుజూర్ నగర్ లోని రామస్వామి గట్టు వద్ద నున్న గుట్టల నుండి టిప్పర్లతో రోజుకు 100 ట్రిప్పల మట్టిని అక్రమంగా తోలుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక ట్రిప్పు రూ. 5 వేల నుండి 6 వేల వరకు అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. దందా నడుపుతున్న వారికి రోజుకు 2 లక్షల వరకు మిగిలే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 3 సంవత్సరాల నుండి అంటే వీరి అక్రమ సంపాదన కోట్లలో ఉండే అవకాశం ఉంది. దీంతో వీరి దందా ఏ స్థాయిలో కొనసాగుతుంతో అర్థమవుతోంది. వీరి వల్ల ఎన్ని చెట్లు, పచ్చని సంపద నాశనం అయిందో చెప్పనలవి కాదు.



