మాజీ సర్పంచ్ యాకయ్య దారుణ హత్య.. ఇంటి ముందే నిద్రిస్తున్న సమయంలో కిరాతకంగా చంపిన దుండగులు

మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య (57) దారుణ హత్యకు గురైన ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

మహబూబాబాద్, జూలై 1 (నిజం న్యూస్):

మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య (57) దారుణ హత్యకు గురైన ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

మంగళవారం అర్ధరాత్రి తన ఇంటి ముందు వరండాలో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసి కిరాతకంగా హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, యాకయ్య ప్రతిరోజులాగే మంగళవారం రాత్రి ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండగా దుండగులు అక్కడికి చేరుకుని విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

 

బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు యాకయ్య రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

ఈ హత్యకు వ్యక్తిగత విభేదాలు, పాత కక్షలు, ఆస్తి వివాదాలు లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.

 

మాజీ సర్పంచ్ హత్యతో సింగారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

 

*_శ్రీనివాస్ నాయక్*

*స్టేట్ బ్యూరో, నిజం న్యూస్*

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button