ఆధార్‌తో రూ.3 లక్షల లోన్ అంటూ మోసం..! నకిలీ ప్రకటనలపై కేంద్రం హెచ్చరిక
ఆధార్ కార్డు ఉంటే ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల వరకు రుణం ఇస్తామని సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా ప్రచారం చేస్తున్న ప్రకటనలు పూర్తిగా నకిలీవని కేంద్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

హైదరాబాద్, జూలై 1 (నిజం న్యూస్): ఆధార్ కార్డు ఉంటే ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల వరకు రుణం ఇస్తామని సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా ప్రచారం చేస్తున్న ప్రకటనలు పూర్తిగా నకిలీవని కేంద్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.
“ప్రధానమంత్రి లోన్ స్కీమ్” పేరుతో కొన్ని మోసగాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపింది.
ప్రస్తుతం యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో “ఆధార్ కార్డు ఉంటే వెంటనే రూ.3 లక్షల లోన్”, “ప్రభుత్వం ఉచిత రుణాలు అందిస్తోంది” వంటి ఆకర్షణీయ ప్రకటనలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రకటనల్లో ఇచ్చే లింక్‌లను క్లిక్ చేసిన తర్వాత దరఖాస్తు పేరుతో వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు. అనంతరం ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేదా ఫైల్ ఓపెనింగ్ ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అంతేకాకుండా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, OTP వంటి కీలక సమాచారాన్ని సేకరించి బాధితుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ పథకాల పేర్లను దుర్వినియోగం చేస్తూ అమాయక ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన మేరకు, ఏ ప్రభుత్వ రుణ పథకం అయినా సంబంధిత శాఖలు, బ్యాంకులు లేదా అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే అమలు చేయబడుతుంది. యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్ మెసేజ్‌లు లేదా గుర్తు తెలియని వెబ్‌సైట్ల ద్వారా రుణాలు మంజూరు చేయడం జరగదని పేర్కొంది.
ఇటీవల దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) కూడా ప్రజలను పలుమార్లు హెచ్చరించింది. అనుమానాస్పద లింకులు, ఫేక్ యాప్‌లు, నకిలీ ప్రభుత్వ పథకాల పేర్లతో జరిగే మోసాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
నిజం న్యూస్ సూచన – ప్రజలకు అవగాహన:
ప్రభుత్వం పేరుతో వచ్చే ప్రతి ప్రకటన నిజమని నమ్మకండి. ఏదైనా రుణం, సబ్సిడీ లేదా నగదు సహాయం గురించి సమాచారం వస్తే ముందుగా సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ లేదా బ్యాంకును సంప్రదించి నిర్ధారించుకోండి. తెలియని వ్యక్తులకు ఆధార్, PAN, బ్యాంకు ఖాతా వివరాలు, OTPలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. ప్రజల అప్రమత్తతే ఇలాంటి మోసాలను అరికట్టే ప్రధాన ఆయుధం.
– శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



