వరంగల్ సీసీఎస్ ఎస్ఐపై తీవ్రమైన ఆరోపణలు.. వివాహిత ఫిర్యాదుతో కేసు నమోదు

హనుమకొండ పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన మహిళ 2018లో బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో ప్రేమ వివాహం చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో 2022 మార్చిలో భర్తపై హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అప్పట్లో అదే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోదారి రాజ్‌కుమార్ కేసు పరిష్కరిస్తానని నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

– నాలుగేళ్లుగా లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్ చేసినట్లు బాధితురాలి ఆరోపణలు

– హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు

– ఐజీకి ఫిర్యాదు చేసిన బాధిత మహిళ

 

సుబేదారి (వరంగల్), జూన్ 14(నిజం న్యూస్): వరంగల్ పోలీస్ కమిషనరేట్ సీసీఎస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోదారి రాజ్‌కుమార్‌పై ఓ వివాహిత చేసిన ఫిర్యాదుతో తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తనను నాలుగేళ్లుగా మోసం చేసి, లైంగికంగా వేధించాడని, బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

 

బాధితురాలి ఫిర్యాదు, హనుమకొండ పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన మహిళ 2018లో బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో ప్రేమ వివాహం చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో 2022 మార్చిలో భర్తపై హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అప్పట్లో అదే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోదారి రాజ్‌కుమార్ కేసు పరిష్కరిస్తానని నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 

తనకు న్యాయం చేస్తానని, భర్తకు విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ తర్వాత పలుమార్లు లైంగికంగా దాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో ఆమె రెండు సార్లు గర్భం దాల్చగా, అబార్షన్ చేయించాడని కూడా ఆరోపణలు ఉన్నాయి.

 

అంతేకాకుండా పెళ్లి విషయంపై ప్రశ్నించినప్పుడు న్యూడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని, ఆమె ఫోన్‌ను ట్రాక్ చేసి అనుమానించి వేధించాడని బాధితురాలు ఆరోపించింది. పని చేసే ప్రదేశాలకు వెళ్లి, హోటళ్లకు బలవంతంగా తీసుకెళ్లి వేధింపులకు పాల్పడినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది.

 

తాజాగా ఈ నెల మొదటి వారంలో హనుమకొండలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి మళ్లీ లైంగిక దాడి చేసి, తనపై దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. అనంతరం ఆమెను బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

ఈ వేధింపులను భరించలేక బాధిత మహిళ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఐజీకి ఫిర్యాదు చేసింది. ఆదేశాల మేరకు భరోసా కేంద్రంలో ఆమె వాంగ్మూలం నమోదు చేసి, హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు కేసు రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు.

 

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఎస్ఐ గోదారి రాజ్‌కుమార్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపులు, చీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు హనుమకొండ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

 

ఇంతకు ముందు ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన సమయంలో కూడా అవినీతి ఆరోపణలతో ఆయన సస్పెండ్ అయినట్లు సమాచారం. అయితే తాజా కేసులో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.

 

చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ అధికారిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం రేపింది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button