బిర్యానీ కోసం ఫోన్ వాగ్వాదం…నాలుగేళ్ల కుమారుడి కళ్లముందే తల్లిదండ్రుల ఆత్మహత్య
బిర్యానీ తీసుకురావడం విషయంలో ఫోన్‌లో జరిగిన వాగ్వాదం దంపతుల ప్రాణాలు బలితీసుకోగా, వారి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలిన హృదయ విదారక సంఘటన కలకలం రేపుతోంది.

*బిర్యానీ కోసం ఫోన్ వాగ్వాదం.. దంపతుల విషాదాంతం*
*నాలుగేళ్ల కుమారుడి కళ్లముందే తల్లిదండ్రుల ఆత్మహత్య.. విశాఖలో విషాద ఘటన*
విశాఖపట్నం, జూన్ 9 (నిజం న్యూస్):
చిన్నపాటి కుటుంబ వాగ్వాదం తీవ్ర విషాదానికి దారితీసిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. బిర్యానీ తీసుకురావడం విషయంలో ఫోన్‌లో జరిగిన వాగ్వాదం దంపతుల ప్రాణాలు బలితీసుకోగా, వారి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలిన హృదయ విదారక సంఘటన కలకలం రేపుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన బలరాం (33), ప్రియాంక (27) దంపతులు కొంతకాలంగా విశాఖపట్నం శ్రీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి మద్యం సేవించేందుకు బయటకు వెళ్లిన బలరాం, ఇంట్లో ఉన్న భార్య ప్రియాంకకు ఫోన్ చేసి బిర్యానీ తెచ్చి ఉంచాలని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఫోన్‌లో మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో మనస్తాపానికి గురైన ప్రియాంక ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఇంటికి చేరుకున్న బలరాం, భార్య మృతదేహాన్ని చూసి తీవ్ర ఆవేదనకు గురై, భయంతో అదే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఈ దారుణ ఘటన సమయంలో వారి నాలుగేళ్ల కుమారుడు ఇంట్లోనే ఉండటం మరింత విషాదకరంగా మారింది. చిన్నారి కళ్లముందే తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహమే ఈ ఘటనకు కారణమా? లేక మరేదైనా కోణం ఉందా అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, దంపతుల మధ్య అప్పుడప్పుడు చిన్నచిన్న విభేదాలు ఉన్నట్లు సమాచారం. అయితే, అసలు కారణాలపై పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. చిన్నపాటి గొడవలు, ఆవేశపూరిత నిర్ణయాలు కుటుంబాలను ఎంతటి విషాదంలోకి నెడతాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



