ఢిల్లీలో ఘోర అగ్నికీలలు.. 21 మంది సజీవ దహనం
‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’లో బుధవారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో హోటల్‌లో 40 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు బయటపడలేక చిక్కుకుపోయారు.

30 మందికిపైగా గాయాలు.. మోదీ దిగ్భ్రాంతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటన
న్యూఢిల్లీ, జూన్ 3 (నిజం న్యూస్): దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుని 21 మంది మృతిచెందగా, 30 మందికిపైగా గాయపడిన విషాద ఘటన కలకలం రేపింది. ఢిల్లీలోని మల్వియా నగర్ పరిధిలో హౌజ్ రాణీ ప్రాంతంలోని ఐదంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
భవనం బేస్‌మెంట్‌లో ఉన్న ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’లో బుధవారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో హోటల్‌లో 40 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు బయటపడలేక చిక్కుకుపోయారు.
ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద సమయంలో హోటల్‌లో ఉన్న వారిలో మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి
ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.



