తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక.. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 18 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు.

హైదరాబాద్, జూన్ 3 (నిజం న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం అధికంగా ఉండొచ్చని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం 18 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు.
భారీ వర్షాలతో పాటు గంటకు వేగంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మరోవైపు దేశవ్యాప్తంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రేపటిలోగా కేరళ, తమిళనాడు తీరాలను తాకే అవకాశమున్నట్లు సమాచారం. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
రాబోయే రెండు రోజుల పాటు మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని అధికారులు సూచించారు.



