పర్యాటకులను వేధించిన మహిళలకు కోర్టు వినూత్న శిక్ష
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంజు సింగ్, సబి దేవి, మను దేవి, మనీషా, శకుంతల అనే మహిళలు చార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో పర్యాటకులను అడ్డగించి బలవంతంగా కాగితపు పూలు అమ్ముతున్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు. వీరి కారణంగా పాదచారులు, పర్యాటకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని పోలీసులు తెలిపారు.

చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో ఒక రోజు సామాజిక సేవ చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశం
హైదరాబాద్, మే 25 (నిజం న్యూస్):
చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకులను ఇబ్బందులకు గురి చేస్తూ ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన ఐదుగురు మహిళలకు నాంపల్లి కోర్టు వినూత్న శిక్ష విధించింది. జరిమానాతో పాటు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో సామాజిక సేవ చేయాలని కోర్టు ఆదేశించింది.
పోలీసుల వివరాల ప్రకారం, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంజు సింగ్, సబి దేవి, మను దేవి, మనీషా, శకుంతల అనే మహిళలు చార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో పర్యాటకులను అడ్డగించి బలవంతంగా కాగితపు పూలు అమ్ముతున్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు. వీరి కారణంగా పాదచారులు, పర్యాటకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని పోలీసులు తెలిపారు.
దీంతో చార్మినార్ పోలీసులు 66(సీ) సీపీ యాక్ట్‌తో పాటు బీఎన్ఎస్ 292 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి, పూర్తి ఆధారాలతో నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి మహిళలకు జరిమానా విధించడంతో పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.
పర్యాటకులను వేధించడం, ఫుట్‌పాత్‌లను అక్రమంగా ఆక్రమించడం వంటి చర్యలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చార్మినార్ పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్‌కు వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.



