మారని పోలీసుల రాత..!సీఎం చేతిలో హోం శాఖ..

కొత్త డీజీపీ నిర్ణయాల పైనే ఆశలు..

ప్రజల మానప్రాణాలకు రక్షణగా నిలిచే పోలీసు వ్యవస్థ నేడు స్వయం రక్షణ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న సుమారు 81,800 మంది పోలీసు సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు, విపరీతమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నారు.

ప్రభుత్వ మారి కీలకమైన హోం శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నా.. క్షేత్రస్థాయి పోలీసుల కష్టాలు మాత్రం తీరడం లేదు.

పెండింగ్‌లో డీఏలు, పీఆర్సీ..!

పోలీసు కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణాలు 5 డీఏల పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తుంది. గత 30 నెలలుగా ఒక్క టీఏ కూడా విడుదల కాకపోవడంతో వేల రూపాయల నష్టం వాటిల్లుతోంది.పాత పీఆర్సీకి సంబంధించిన ఏరియర్స్ (బకాయిలు) ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలాయి. జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో, పిల్లల ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారు.

సరెండర్ లీవ్స్ కూడా అందడం లేదు…!

కష్టపడి పని చేసినందుకు దక్కాల్సిన సరెండర్ లీవ్ మనీ కూడా అందకపోవడం వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. పోలీసు శాఖలో కెరీర్ ఎదుగుదల మందగించింది. 2018లో హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన వారు, ఇప్పటికీ ఏఎస్సై (ASI) ప్రమోషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రిటైర్డ్ డీజీపీలకు ఎన్ని విన్నపాలు చేసినా ఫలితం లేకపోవడంతో మా బాధలు వినేవారెవరని కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పగలు రాత్రి తేడా లేకుండా రోడ్లపై విధులు నిర్వహిస్తున్నాం. కానీ మా ఇంట్లో పిల్లల చదువులకు డబ్బులు లేక, పెండింగ్ డీఏలు రాక అప్పుల పాలవుతున్నాం. పని ఒత్తిడికి తోడు ఆర్థిక ఇబ్బందులు తోడవ్వడంతో ప్రాణాలు పోతున్నాయని ఆవేదన పడుతున్నారు.

ఆ శాంతిభద్రతలను కాపాడే పోలీసుల కడుపు మండితే వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించి “పోలీసు కుటుంబాలను ఆదుకోవాలని యావత్ పోలీస్ యంత్రాంగం కోరుకుంటోంది.

కొత్త డీజీపీ పైనే ఆశలు.. పరిష్కారం దిశగా అడుగులు పడేనా..?

రాష్ట్ర పోలీస్ బాస్ గా బాధ్యతలు చేపట్టిన కొత్త డీజీపీ సివి ఆనంద్ పోలీసుల సమస్యలపై ఎలాంటి ముందడుగు వేస్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

క్షేత్రస్థాయిలో ఉన్న వేలాది మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల గోడును ఎలా ఆలకిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల ఫైళ్లు, ఆర్థిక బకాయిల అంశంపై ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కారం చూపుతారని సిబ్బంది ఎదురుచూస్తున్నారు. పోలీసుల సంక్షేమం పట్ల ఆయన తీసుకునే విప్లవాత్మక నిర్ణయాలు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయా? లేక పాత పద్ధతులే కొనసాగుతాయా? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, శాంతిభద్రతలను కాపాడే పోలీసుల కష్టాలు తీరితేనే వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోతే భవిష్యత్తులో పోలీస్ శాఖలో చేరేందుకు యువత విముఖత చూపే అవకాశం తో పాటు మొత్తం వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. బెనిఫిట్స్ విడుదల చేయకపోతే పటిష్టమైన పోలీస్ వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button