అంబేద్కర్ భవనమా..? మున్సిపల్ స్టోర్ రూమా?!

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డులో గల గాంధీ పార్క్‌లో అసంపూర్తిగా వదిలేసిన అంబేద్కర్ భవనాన్ని వెంటనే అభివృద్ధి చేయాలని, గాంధీ పార్క్‌ను ప్రజలకు విడుదల చేయాలని, కొత్తగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 33వ వార్డు కౌన్సిలర్ బి. అజయ్ సారధి రెడ్డి డిమాండ్ చేశారు

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, ఏప్రిల్, 06(నిజం న్యూస్ )

ఈ మేరకు అంబేద్కర్ భవన్ వద్ద ఆయన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017–18 సంవత్సరాలలో శివరాత్రి రోజు అంబేద్కర్ భవన్‌ను అక్రమంగా కూల్చివేశారని,

అనంతరం సిపిఐతో పాటు ఇతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు. అప్పటి మంత్రి కడియం శ్రీహరి ఏడాదిలో భవనం పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదని విమర్శించారు.

ప్రస్తుతం అంబేద్కర్ భవన్ పరిస్థితి దయనీయంగా మారిందని, ఇది భవనమా లేక మున్సిపల్ స్టోర్ రూమా అన్నట్లుగా లోపల మున్సిపల్ సామగ్రి నిల్వ ఉంచారని ఆరోపించారు. వెంటనే భవనాన్ని పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవాలని కోరారు.

అలాగే, 9 నెలల క్రితం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించిన కొత్త కూరగాయల మార్కెట్ ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడంపై ప్రశ్నించారు.

వెంటనే సమీకృత కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించాలని, గాంధీ పార్క్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ తక్షణమే స్పందించి

ఈ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button