ఇసుక తరలింపులో పారదర్శకతకు మన ఇసుక వాహనం అమలు

- అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు, గ్రామ పాలన అధికారులకు ఐడీఓసీలో సమావేశం
వేములవాడ ఏప్రిల్ 2 ( నిజంచెపుతాం )
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇసుక తరలింపులో పారదర్శకత కోసం మన ఇసుక వాహనం అమలు చేస్తున్నామని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తెలిపారు.
మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం, అప్లికేషన్ డౌన్లోడ్, ఆన్లైన్ లో అనుమతులు జారీ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు,
వార్డు ఆఫీసర్లు, గ్రామ పాలన అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్మాణ పనులు, ఇందిరమ్మ ఇండ్లు, భవనాలు, ఇండ్ల నిర్మాణాలకు ఇసుక *సెంటర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన మన ఇసుక వాహనంఅప్లికేషన్, ఆన్లైన్ వెబ్ సైట్ లో నిర్మాణదారులు ఇసుక ఎలా బుక్ చేసుకోవాలి? డబ్బు ఎలా చెల్లించాలి? ఇసుక ఏ రీచ్ నుంచి పొందాలి? ఆన్లైన్ లో ఆయా అధికారులు ఇసుక అనుమతులు ఎలా జారీ చేయాలో స్పష్టంగా వివరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానం ద్వారా ఇసుక సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కమిటీ ఆమోదించిన ఇసుక రీచ్ ల నుంచే ఇసుక తరలించాలని తెలిపారు. ఇసుక తరలింపులో నేరుగా కూపన్లు ఇచ్చే విధానం నుంచి ఆన్లైన్ ద్వారా పొందే విధానం అమలు చేస్తామని, ఇసుక కేటాయింపు, తరలింపు పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని వివరించారు. ఇసుక కోసం ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునే విషయమై రెవెన్యూ అధికారులు సహాయం అందిస్తారని తెలిపారు.
సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా మైనింగ్ అధికారి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.



