ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకే గ్రామసభలు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ గొప్ప కార్యక్రమమని, ఒకే రోజు జిల్లాలోని 268 గ్రామపంచాయతీలో గ్రామసభలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

 

వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

 

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో మార్చి 02 (నిజం చెపుతాం)

 

గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ లో భాగంగా ఏదుల మండలం ఏదుల గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలంగాణ గీతాలాపన చేసి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అందించిన సందేశాన్ని చదివి గ్రామ ప్రజలకు వినిపించారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత రెండున్నర ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చదివి వినిపించారు.

గ్రామంలో అమలు చేసిన వివిధ ప్రభుత్వ పథకాలు వాటిని పొందిన లబ్ధిదారుల వివరాలను అధికారులు చదివి వినిపించారు.

గ్రామంలో రైతు రుణమాఫీ పొందిన లబ్ధిదారులు, జరిగిన రుణమాఫీ మొత్తం, రైతు భరోసా, వరి ధాన్యం సేకరణ చెల్లించిన నగదు, మొత్తం రేషన్ కార్డులు, కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డులు, 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారులు, ఇంకా మంజూరు చేయాల్సి ఉన్న వివరాలు, స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన వడ్డీ లేని రుణాలు, చేయూత పెన్షన్ల లబ్ధిదారులు, ఉచిత చీరల పంపిణీ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించిన పనిదినాలు, మంజూరు అయిన వేతనం, చేపట్టిన పనులు, అంచనా విలువ తదితర అంశాలను లబ్ధిదారుల పేర్లతో సహా చదివి వినిపించారు.

గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలు, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల బాధ్యతల పై గ్రామ సభలో చర్చించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ గొప్ప కార్యక్రమమని, ఒకే రోజు జిల్లాలోని 268 గ్రామపంచాయతీలో గ్రామసభలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.

గ్రామంలో ప్రజలకు జరిగిన మంచిని తెలియజేయడమే కాకుండా, ఇంకా గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాల విషయాలని గ్రామసభ ముందు ఉంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళా శక్తి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పెన్షన్, ఉచిత చీరల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజల మన్ననలను అందుకుంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందన్నారు.

దాంతో పాటుగా రైతులకు రూ. 21 వేల కోట్లతో రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించింది అన్నారు. ఇవే కాకుండా యంగిండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, పేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం అందించిందన్నారు.

ఏదుల గ్రామంలో 303 మంది రైతులకు గాను మొత్తం రూ. 2.77 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలో మొత్తం 1351 రేషన్ కార్డులు ఉండగా కొత్తగా 192 రేషన్ కార్డులను జారీ చేసినట్లు తెలియజేశారు. పేద ప్రజలు కరెంటు బిల్లు భారాన్ని మోయకుండా  ఇబ్బందులను తొలగిస్తూ గృహ జ్యోతి పథకంతో 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించడం జరుగుతుందని తెలియజేశారు.

గ్రామంలో 489 మంది లబ్ధిదారులు గృహజ్యోతి ఫలాలను పొందుతున్నట్లు తెలిపారు. త్వరలోనే కొత్తగా పెన్షన్లను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.త్వరలోనే ఏదుల మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం, గురుకుల పాఠశాల, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలకు కూడా అడుగులు ముందుకు పడేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏదుల మండల కేంద్రంలో గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే నిధుల నుంచి నూతన బస్టాండును నిర్మించేందుకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

అదేవిధంగా కలెక్టర్ ద్వారా పాఠశాల భవన నిర్మాణం కోసం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఈ రెండున్నర ఏళ్లలో ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించింది, ఏ విధమైన అభివృద్ధి చేసింది అనే విషయాలను ప్రజలకు వివరించడమే కాకుండా, ఇంకా ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకునేందుకే ఈ గ్రామసభలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

జిల్లా వ్యాప్తంగా రూ. 480 కోట్లతో రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా 1.75 లక్షల మంది రైతులకు రూ. 250 కోట్లతో రైతు భరోసా అందించడం జరిగిందన్నారు. త్వరలోనే ప్రభుత్వం విద్యార్థుల ఆకలి తీర్చేందుకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా అమల్లోకి తీసుకురానన్నట్లు తెలిపారు.

తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఎదుల గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా ఏదుల మండలంలో రైతుల విజ్ఞప్తి మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button