హెచ్చరించినా మారని తీరు .. ఎస్సై పై మంత్రి ఉత్తమ్ గుస్సా..!
అధికారుల ప్రవర్తన ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉంది..!

రాజకీయ జోక్యాన్ని సహించేది లేదు.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయండి” అని అధికారులకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదేపదే స్పష్టం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై (SI) ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నా, సదరు అధికారి తీరులో కించిత్తు మార్పు రాకపోవడం గమనార్హం.
వృత్తి ధర్మాన్ని మర్చి.. దురుసుగా ప్రవర్తిస్తూ..!
శాంతిభద్రతలను కాపాడాల్సిన రక్షకభటులే భక్షకులుగా మారుతున్నారా? అన్న అనుమానం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. తమ సమస్యలను చెప్పుకోవడానికి స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల సదరు ఎస్సై అత్యంత దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం చేయమని వేడుకునే వారిని కనీసం మనుషులుగా కూడా చూడకుండా, సమస్యను పరిష్కరించాల్సింది పోయి వారిపైనే విరుచుకుపడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి మాటలకూ విలువేది..?
నియోజకవర్గ అభివృద్ధి, పారదర్శక పాలనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన వేళ, ఇలాంటి అధికారుల ప్రవర్తన ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉంది. “పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవు” అని స్వయంగా మంత్రి హెచ్చరించినప్పటికీ, అదే పాత పంథాను కొనసాగించడం వెనుక సదరు అధికారికి ఉన్న ధీమా ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
న్యాయం కోసం వచ్చే సామాన్యులను ఇబ్బంది పెడుతూ, వృత్తి ధర్మాన్ని విస్మరించి వ్యవహరిస్తున్న ఇలాంటి అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలతో మర్యాదగా ప్రవర్తించే, సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించే అధికారులను నియమించాలని ఇప్పుడు హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.



