ఆకు పసరుతో… నిలువు దోపిడి..శాశ్వత వికలాంగులుగా మారుతున్న రోగులు
హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని పసరు కట్టు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని వైద్యం పేరిట అమాయక ప్రజలను మోసం చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా దందాను కొనసాగిస్తున్నారు.

*హుజూర్ నగర్ లో పసరు వైద్యం పేరిట రోగుల ప్రాణాలతో చెలగాటం*…!
*వంశపారంపర్యం” అనే ముసుగు లో పసరు దందా*..!
*అర్హత ‘సున్నా’.. వసూళ్లు ‘వేలల్లో*’..!
*శాస్త్రీయత లేని వైద్యంతో వైకల్యం ముప్పు*…!
*అమాయకత్వమే పెట్టుబడిగా ‘నకిలీ రాయుళ్ల’ దందా*..!
*అనాగరిక చికిత్స.. శాశ్వత వికలాంగులుగా మారుతున్న రోగులు*..!
హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని పసరు కట్టు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని వైద్యం పేరిట అమాయక ప్రజలను మోసం చేస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా దందాను కొనసాగిస్తున్నారు.
కనీస వైద్యార్హత లేని వ్యక్తులు, శాస్త్రీయత లేని పద్ధతులతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
కాసుల కక్కుర్తితో నకిలీ వైద్యులు చేస్తున్న ఈ అడ్డగోలు వసూళ్లు, అనాగరిక చికిత్సలు బాధితులను శాశ్వత వికలాంగులుగా మారుస్తున్నాయి. పట్టణంలోని ఈ కేంద్రాల్లో ఎముక ఏ స్థాయిలో విరిగింది,
లోపల నరాలు దెబ్బతిన్నాయా అనే కనీస అవగాహన కూడా ఉండదు. తామే ‘మహా వైద్యులమని’ నమ్మబలుకుతూ.. కేవలం కొన్ని ఆకులు, పసర్లు రాసి, రక్త ప్రసరణ ఆగిపోయేలా గట్టిగా కట్టు కట్టేస్తున్నారు.
ఫలితంగా ఎముక అతుక్కోకపోగా, లోపల ఇన్ఫెక్షన్ సోకి ఆ భాగం పూర్తిగా కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.
గతంలో హుజూర్ నగర్ మండలం లోని ఒక వ్యక్తి ఇలాగే పసరు వైద్యుడిని నమ్మి, చివరకు తన చెయ్యిని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసే సర్టిఫికేట్ కూడా లేని వీరు, ఏ ధైర్యంతో క్లినిక్‌లు నడుపుతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
“వంశపారంపర్యం” అనే ముసుగు వేసుకొని చట్టవిరుద్ధంగా వైద్యం సాగిస్తున్నారు. ఒక్కో కట్టుకు వేల రూపాయలు వసూలు చేస్తూ పేద ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. పరిస్థితి విషమించాక బాధితులు మళ్ళీ లక్షల రూపాయలు వెచ్చించి పట్టణాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది.
ప్రజారోగ్యంతో బహిరంగంగా ఆటలాడుకుంటున్న ఈ కేంద్రాలపై వైద్యారోగ్య శాఖ ఎందుకు మౌనం వహిస్తోందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల కళ్ళ ముందే ఇంత పెద్ద దందా నడుస్తున్నా, తనిఖీలు ఎందుకు చేయడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



