మంత్రి ఉత్తమ్ ఇలాకాలో సన్నబియ్యం పక్కదారి

పేదవాడి ఆకలి తీర్చాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'సన్న బియ్యం' పథకం కొందరు కిలేడీ డీలర్ల చేతుల్లో అపహాస్యమవుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోనే సన్న బియ్యం బస్తాలు దారి మళ్లుతున్నాయి.

రేషన్ డీలర్ల ‘తీపి’ దగా…!

బస్తాకు రూ.1200.. దళారులతో డీల్…!

రికార్డుల్లో మాయాజాలం.. అధికారుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారం..!

పేదవాడి ఆకలి తీర్చాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘సన్న బియ్యం’ పథకం కొందరు కిలేడీ డీలర్ల చేతుల్లో అపహాస్యమవుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోనే సన్న బియ్యం బస్తాలు దారి మళ్లుతున్నాయి.

పేదలకు అందాల్సిన అన్నాన్ని దళారుల పరం చేస్తూ, డీలర్లు కాసుల కక్కుర్తితో కొత్త వేషాలు వేస్తున్నారు.సన్న బియ్యానికి బదులు.. పప్పు, చక్కెర ప్యాకెట్లు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బృహత్తర పథకాన్ని హుజూర్ నగర్ నియోజకవర్గంలోని కొందరు డీలర్లు అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనకు తెరలేపారు. లబ్ధిదారులకు సన్న బియ్యం ఇవ్వకుండా, వారికి ఆశ చూపి ఒక పంచదార ప్యాకెట్ లేదా కందిపప్పు ప్యాకెట్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

బియ్యం కంటే ఈ ప్యాకెట్లే నయమనే భ్రమను కల్పిస్తూ, అసలైన సన్న బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తున్నారు.

బస్తాకు రూ.1200.. దళారులతో డీల్…!

గతంలో దొడ్డు బియ్యాన్ని తక్కువ ధరకు అమ్మిన డీలర్లు, ఇప్పుడు సన్న బియ్యంపై భారీగా లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో సన్న బియ్యానికి ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, ఒక్కో బస్తాను రూ.1000 నుండి రూ.1200 మధ్యలో దళారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

పగలు లబ్ధిదారులకు మొండిచేయి చూపిస్తూ, రాత్రి వేళల్లో ఈ బియ్యం నిశ్శబ్దంగా గోడౌన్ల నుండి మాయమవుతోంది.

రికార్డుల్లో మాయాజాలం.. అధికారుల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారం..!

స్టాక్ లెక్కల్లో దొరకకుండా ఉండేందుకు డీలర్లు ఆరితేరిన విద్యను ప్రదర్శిస్తున్నారు. తూకాల్లో తేడాలు చూపిస్తూ, పప్పులు, చక్కెర పంపిణీ చేసినట్లుగా రికార్డులను మారుస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇంత బహిరంగంగా అక్రమాలు జరుగుతున్నా, పౌరసరఫరా శాఖ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాలు మారుతున్నా డీలర్ల తీరు మారడం లేదు. ఈ దందాపై పై అధికారులు జర నజర్ వేయాలని పేదల నోటి కాడి కూడును దోచుకుంటున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోండి అంటూ లబ్ధిదారులు కోరుతున్నారు.

ప్రభుత్వం కోట్లు వెచ్చించి అందిస్తున్న ఈ పథకం లబ్ధిదారులకు చేరాలంటే క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో పనిచేసారు. ప్రస్తుతం నిజం న్యూస్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button