ఆకేరు వాగులో అక్రమ ఇసుక రవాణా.. కలెక్టర్‌ దృష్టి సారించాలి

అనుమతులు లేకుండానే ఇసుక తరలింపునకు సహకరిస్తున్నారంటూ చిన్నగూడూరు తహసీల్దార్‌పై ఆరోపణలు

మహబూబాబాద్, ఆగస్టు 13 (నిజం న్యూస్):

చిన్నగూడూరు మండలంలోని ఆకేరు వాగు నుంచి జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై జిల్లా కలెక్టర్‌ వెంటనే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ కోరారు.

ఈ సందర్భంగా రమేష్ నాయక్ మాట్లాడుతూ.. చిన్నగూడూరు మండలంలో రోజుకు 50కి తగ్గకుండా ఇసుక ట్రాక్టర్లు ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నాయని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా కొందరు ఇసుక మాఫియా వ్యక్తులకు తహసీల్దార్‌ సహకరిస్తున్నారని ఆరోపించారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక రవాణా కోసం ఏర్పాటు చేసిన ‘మన ఇసుక వాహనం’ పోర్టల్‌కు సంబంధించిన ఆన్‌లైన్ సేవలు దాదాపు రెండు నెలలుగా పూర్తిస్థాయిలో నిలిచిపోయినప్పటికీ, చిన్నగూడూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా మాత్రం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

ప్రతి ట్రాక్టర్‌కు ఒక రేటు నిర్ణయించి, ఆ రేటుకు అంగీకరించిన వారికి ఎలాంటి అనుమతులు లేకున్నా ఇసుక తరలింపునకు అవకాశం కల్పిస్తున్నారని రమేష్ నాయక్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై గతంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ చిన్నగూడూరు తహసీల్దార్‌ను మందలించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని అన్నారు.

అక్రమ ఇసుక రవాణా ద్వారా నెలకు లక్షల రూపాయల ఆదాయం వస్తోందని, అందులో కొంతమొత్తం డివిజనల్ స్థాయి, పై రెవెన్యూ అధికారులకు చేరుతోందని రమేష్ నాయక్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఒకవైపు వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు రెవెన్యూ, మైనింగ్ అధికారులు వాల్టా చట్టాన్ని పట్టించుకోకుండా అక్రమ ఇసుక రవాణాకు అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇకనైనా జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి చిన్నగూడూరు ఆకేరు వాగుపై కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా ర్యాంపులపై ట్రెంచ్‌లు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను నిలిపివేయడంతో పాటు, సంబంధిత తహసీల్దార్‌, డివిజనల్ స్థాయి అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బోడ రమేష్ నాయక్ కోరారు.

-శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో,నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button