ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య.. 27 కత్తిపోట్లు
గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను హత్య చేసిన ఘటన బుధవారం వెలుగుచూసింది. మృతదేహంపై సుమారు 27 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల నివాసాలకు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కత్తులతో అతి దారుణంగా హతం.. ఇంట్లో చోరీ ఆనవాళ్లు లేవు
పక్కా రెక్కీతోనే హత్య చేశారా? పరిచయస్తుల పాత్రపై పోలీసుల దర్యాప్తు
నిజం న్యూస్, కొండమల్లేపల్లి, ఆగస్టు 13: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి ఆమెను హత్య చేసిన ఘటన బుధవారం వెలుగుచూసింది. మృతదేహంపై సుమారు 27 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల నివాసాలకు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లు రూపారెడ్డి (48/52) కొండమల్లేపల్లి పట్టణంలోని నాగార్జున గ్రామర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా, డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కల్లు రాజేందర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దంపతులు మండల కేంద్రంలోని జేబీ కాలనీలోని తమ సొంత నివాసంలో ఉంటున్నారు. వీరికి హైదరాబాద్ శివారులోని గుర్రంగూడలో కూడా ఇల్లు ఉన్నట్లు సమాచారం.
దంపతుల కుమారుడు అభినవ్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతూ అక్కడే ఉంటున్నాడు. దీంతో సెలవు రోజుల్లో రూపారెడ్డి, ఆమె భర్త హైదరాబాద్‌కు వెళ్లి కుమారుడి వద్ద గడిపి తిరిగి వస్తుంటారు. తాజాగా శని, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో దంపతులు హైదరాబాద్‌కు వెళ్లారు.
అయితే భర్త రాజేందర్‌రెడ్డికి హైదరాబాద్‌లో పని ఉండటంతో ఆయన అక్కడే ఉండగా, రూపారెడ్డి మంగళవారం ఉదయం ఒంటరిగా కొండమల్లేపల్లికి తిరిగి వచ్చారు. అనంతరం పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహించారు. సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో స్నేహితులు వస్తున్నారని చెప్పి ఇంటికి వెళ్లినట్లు సమాచారం.
ఫోన్‌కు స్పందించకపోవడంతో అనుమానం
బుధవారం ఉదయం రాజేందర్‌రెడ్డి భార్య రూపారెడ్డికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఆఫ్లో వచ్చింది. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే కొండమల్లేపల్లిలోని తమ ఇంట్లో అద్దెకుంటున్న వారికి ఫోన్ చేసి రూపారెడ్డితో మాట్లాడించాలని కోరారు.
అద్దెకు ఉంటున్న వారు ఇంటికి వెళ్లి పలుమార్లు తలుపు తట్టినా లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చుట్టుపక్కల వారిని పిలిచారు. వారు కూడా తలుపు కొట్టినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంటి వెనుక వైపున ఉన్న కిచెన్ వద్దకు వెళ్లి చూడగా తలుపులు తెరిచి ఉన్నట్లు గుర్తించారు.
లోపలికి వెళ్లి చూడగా రూపారెడ్డి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నారు. దీంతో వెంటనే ఆమె భర్తకు, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్
సమాచారం అందుకున్న దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్‌రావు, కొండమల్లేపల్లి సీఐ నవీన్‌కుమార్, ఎస్ఐ అజ్మీర రమేశ్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలను సేకరించారు. ఇంట్లోని పరిసరాలు, ప్రవేశ ద్వారాలు, వెనుక వైపు ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
మృతురాలి కుమారుడు అభినవ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు.
దొంగతనం ఆనవాళ్లు లేకపోవడం.. పలు అనుమానాలు
రూపారెడ్డి హత్య జరిగిన ఇంట్లో ఎలాంటి వస్తువులు, నగదు చోరీకి గురికాలేదని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఘటన దొంగతనం కోసం జరిగిన హత్య కాదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూపారెడ్డికి పరిచయమున్న వ్యక్తులే హత్యకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అదే సమయంలో కుటుంబ కలహాలు, వ్యక్తిగత వ్యవహారాలు లేదా మరేదైనా కారణం హత్యకు దారితీసిందా? అనే అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యకు సంబంధించి స్పష్టమైన కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
మంగళవారం రాత్రే హత్య జరిగిందా?
మంగళవారం సాయంత్రం సుమారు 7.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. రూపారెడ్డి శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారు? నిందితులు ఎటువైపు నుంచి వచ్చారు? హత్య అనంతరం ఏ మార్గంలో వెళ్లారు? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
పక్కా రెక్కీతోనే హత్య చేశారా?
హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అనుమానితుల కదలికలపై స్పష్టమైన ఆధారాలు లభించలేదని సమాచారం. రూపారెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోనూ అనుమానాస్పద కదలికలు కనిపించలేదని తెలుస్తోంది.
ముఖ్యంగా ఇంటి వెనుక వైపు సీసీ కెమెరాలు లేకపోవడాన్ని గమనించిన దుండగులు అదే మార్గాన్ని ఎంచుకుని ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగానే ఇంటి పరిసరాలను పరిశీలించి, ఎప్పుడు ఆమె ఒంటరిగా ఉంటారో తెలుసుకుని పక్కా రెక్కీ నిర్వహించిన అనంతరం హత్యకు పాల్పడ్డారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుల కోసం ముమ్మర దర్యాప్తు
హత్య జరిగిన తీరును బట్టి నిందితులను గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, మొబైల్ ఫోన్ వివరాలు, ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, మృతురాలికి పరిచయమున్న వ్యక్తుల వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
రూపారెడ్డి మృతదేహంపై సుమారు 27 కత్తిపోట్లు ఉండటం ఈ హత్య ఎంత దారుణంగా జరిగిందో తెలియజేస్తోంది. హత్యకు ముందు, తరువాత ఆమె ఎవరిని కలిశారు? ఎవరితో ఫోన్లో మాట్లాడారు? అనే వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.
ఎమ్మెల్యే బాలునాయక్ దిగ్భ్రాంతి
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యపై ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నాయినీ జమున మాధవరెడ్డి, ఎంఏ సీరాజ్ ఖాన్, ఉట్కూరి వేమనరెడ్డి, ఎడుపుల గోవింద్, దొండేటి మల్లారెడ్డి, హరికృష్ణ, కోట్ల జగదీశ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రూపారెడ్డి హత్య విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో కొండమల్లేపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది.
హత్యకు అసలు కారణం ఏమిటి? నిందితులు ఎవరు? ఈ దారుణ ఘటన వెనుక ఎవరైనా పరిచయస్తుల ప్రమేయం ఉందా? లేక పక్కా ప్రణాళికతోనే హత్య జరిగిందా? అన్న ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



