కురవి నాగార్జున విద్యాలయంపై చర్యలేవి..? డీఈవో మౌనం వెనుక కారణమేంటి..?
విద్యార్థుల భద్రతపై డీఈవో ఎందుకు స్పందించడం లేదు..?

నిజం న్యూస్ | జూలై 9, 2026
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నాగార్జున విద్యాలయానికి చెందిన స్కూల్ బస్సు ప్రమాదం అనంతరం కూడా సంబంధిత విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఇప్పటివరకు ఈ ఘటనపై స్పందించకపోవడంపై పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికుల కథనం ప్రకారం, పాఠశాలకు మొత్తం ఆరు బస్సులు ఉన్నాయి. వాటిలో రెండు 32 సీట్ల బస్సులు, నాలుగు 42 సీట్ల బస్సులు ఉన్నాయి. ప్రమాదానికి గురైన 32 సీట్ల బస్సు ప్రతిరోజూ రెండు ట్రిప్పులు నిర్వహిస్తుందని చెబుతున్నారు. మొదటి ట్రిప్‌లో బలపాల, లింగ్య తండా, నల్లెల్ల ప్రాంతాల నుంచి, రెండో ట్రిప్‌లో మోదుగులగూడెం, జుజూర్ తండా ప్రాంతాల నుంచి విద్యార్థులను తీసుకువస్తుందని సమాచారం. ఈ రెండు ట్రిప్పులను సమయానికి పూర్తి చేయాలనే తొందరలో బస్సును అతివేగంగా నడపడంతో లారీని ఢీకొట్టి ప్రమాదం జరిగినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. అదృష్టవశాత్తు విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటన నేపథ్యంలో నాగార్జున విద్యాలయానికి ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ, భవన భద్రతా ధ్రువీకరణ, పాఠశాల నిర్వహణకు అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు, పాఠశాల గుర్తింపు, విద్యాసంస్థ నిర్వహణకు అవసరమైన అన్ని పత్రాలు ఉన్నాయా లేదా అనే అంశాలపై విద్యాశాఖ అధికారులు వెంటనే సమగ్ర తనిఖీలు నిర్వహించాలని ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
స్థానికుల ఆరోపణల ప్రకారం, ఈ పాఠశాలలో 650 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. అధిక ఫీజులు వసూలు చేయడం, ప్రతి సంవత్సరం వందకు పైగా అక్రమ టీసీలు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కళ్యాణలక్ష్మి పథకం కోసం అవసరమయ్యే జనన తేదీ (డేట్ ఆఫ్ బర్త్) సంబంధిత ధ్రువపత్రాలు పొందేందుకు వచ్చే వారి వద్ద నుంచి కూడా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలపై కూడా సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రమాదం వంటి తీవ్ర ఘటన జరిగినప్పటికీ ఇప్పటివరకు విద్యాశాఖ నుంచి సమగ్ర తనిఖీలు నిర్వహించకపోవడం, పాఠశాలపై ఎలాంటి చర్యలు ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని తల్లిదండ్రులు, ప్రజలు పేర్కొంటున్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశంలో జిల్లా విద్యాశాఖ ఎందుకు ఆలస్యం చేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు నాగార్జున విద్యాలయంలో తక్షణమే సమగ్ర తనిఖీలు నిర్వహించి, అన్ని పత్రాలు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనలను పరిశీలించాలని కోరుతున్నాయి. నిబంధనల ఉల్లంఘనలు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నాగార్జున విద్యాలయాన్ని సీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ప్రమాద సమయంలో బస్సును నడిపిన డ్రైవర్ డి. భరత్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రవాణా శాఖ అధికారులు నిబంధనల మేరకు రద్దు చేయాలని తల్లిదండ్రులు, ప్రజలు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన ఇంతటి ఘటన జరిగినప్పటికీ జిల్లా డీఈవో ఇప్పటికైనా స్పందించి నాగార్జున విద్యాలయంలో సమగ్ర తనిఖీలు నిర్వహించి, అన్ని ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ చేపట్టి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నాగార్జున విద్యాలయాన్ని సీజ్ చేయాలని ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
-శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో నిజం న్యూస్



