కవితకు ఈసీ బిగ్ షాక్..? ‘TRS’ పేరుపై అభ్యంతరాలు..
15 రోజుల్లో ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని సూచన!

హైదరాబాద్, జూలై 4 (నిజం న్యూస్):
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన TRS (తెలంగాణ రక్షణ సేన) పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ పేరుకు సంబంధించి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని ఎన్నికల సంఘం సూచించినట్లు సమాచారం. గడువులోగా స్పందించకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును ఎలాంటి తదుపరి సమాచారం ఇవ్వకుండా మూసివేస్తామని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
సమాచారం ప్రకారం, TRS అనే సంక్షిప్త నామంపై ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి (BRS)తో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన ఎన్నికల సంఘం, ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కవితకు లేఖ రాసినట్లు సమాచారం.
అయితే, ఈ అంశంపై ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని ఈసీ ఆదేశించింది” అనే వార్తకు అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. మరోవైపు, గతంలో “తెలంగాణ రక్షణ సేన” పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినట్లు అధికారిక సమాచారం వెలువడిన విషయం తెలిసిందే.
ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కవిత పార్టీ తుది పేరు ఏమిటి? ఎన్నికల సంఘం తుది నిర్ణయం ఎలా ఉండబోతోందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



