రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ తొలి లక్ష్యం.. రూ.9 వేల కోట్ల రైతు భరోసా విడుదల: సీఎం రేవంత్ రెడ్డి

తొమ్మిది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించారు.

రైతులకు కాంగ్రెస్ సర్కార్ భారీ శుభవార్త.. రూ.9 వేల కోట్ల రైతు భరోసా విడుదల ప్రారంభం

తొలి విడతలో 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ

నిజం న్యూస్ | జూన్ 30:
తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం కింద రూ.9 వేల కోట్ల నిధుల విడుదలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కి తొలి విడత నిధులను విడుదల చేశారు.

మొదటి విడతలో 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను జమ చేశారు. మిగిలిన నిధులను వచ్చే తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,600 రైతు వేదికల ద్వారా వేలాది మంది రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

సదస్సులో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గత 30 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. 25.35 లక్షల మంది రైతులకు రూ.20,677 కోట్ల రుణమాఫీ అమలు చేశామని, గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.7 వేల కోట్ల రైతు భరోసా నిధులను కూడా చెల్లించామని చెప్పారు. రైతు భరోసా మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచినట్లు గుర్తు చేశారు.

ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.27 వేల కోట్లకు పైగా రైతు భరోసా నిధులు జమ చేశామని, తాజా విడతతో కలిపి మొత్తం రూ.36 వేల కోట్లను రైతు భరోసా కింద చెల్లించినట్లు సీఎం వెల్లడించారు. పంట బోనస్‌గా రూ.4 వేల కోట్లు, వ్యవసాయ పనిముట్ల కోసం రూ.2 వేల కోట్లు, పంట బీమా కోసం రూ.3.5 వేల కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అలాగే గత రెండున్నరేళ్లలో వడ్ల కొనుగోలుకు రూ.80 వేల కోట్లకుపైగా రైతులకు చెల్లించినట్లు చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయని ఆరోపించిన సీఎం, తమ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను గాడిలో పెడుతోందన్నారు. ప్రతి నెల మొదటి తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని, ఆర్టీసీని లాభాల బాట పట్టించామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు.

వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశముందని రైతులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. పంట మార్పిడిపై దృష్టి సారించాలని కోరారు. ప్రజల విశ్వాసంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

_శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button