మధిర నుంచి హైదరాబాద్‌కు మారిన రైతు భరోసా సభ.. శిల్పకళా వేదికలో నేడు పంపిణీ కార్యక్రమం
తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనుంది

హైదరాబాద్, జూన్ 29 (నిజం న్యూస్):
తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనుంది. తొలుత ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసింది.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రత్యక్షంగా, అలాగే వివిధ రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసే ప్రక్రియకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహం అందించే దిశగా రైతు భరోసా పథకం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



