సైబర్ బాధితులకు భారీ ఊరట..!
లోక్ అదాలత్ ద్వారా రూ.45.21 కోట్లు రీఫండ్ – తెలంగాణ పోలీసుల విశేష విజయగాథ

హైదరాబాద్, జూన్ 29 (నిజం న్యూస్):
సైబర్ నేరాల బారిన పడి డబ్బులు కోల్పోయిన వేలాది మంది బాధితులకు తెలంగాణ పోలీసులు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా భారీ ఊరట కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 6,303 మంది సైబర్ మోసం బాధితులకు రూ.45.21 కోట్ల నగదును రీఫండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ రికవరీ ప్రక్రియలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఒక్క సైబరాబాద్ పరిధిలోనే 2,232 మంది బాధితులకు చెందిన రూ.21.91 కోట్లను రికవరీ చేసి తిరిగి అందజేసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నేరుగా తన పరిధిలోని 77 మంది బాధితులకు సంబంధించిన రూ.6.83 కోట్లను రికవరీ చేసింది.
జిల్లాల వారీగా పరిశీలిస్తే మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల నుంచి మోసపోయిన సొమ్మును రికవరీ చేయడంలో రాష్ట్రంలో ముందంజలో నిలిచాయి. బాధితుల ఫిర్యాదులపై వేగంగా స్పందించడం, బ్యాంకులు, చట్ట అమలు సంస్థలు, సంబంధిత ఏజెన్సీల సమన్వయంతో ఈ ఫలితాలు సాధ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 59,953 మంది బాధితులకు రూ.445.41 కోట్లకు పైగా నగదును తిరిగి అందించడం విశేషంగా నిలిచింది. సైబర్ నేరాలపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ తీసుకుంటున్న కఠిన చర్యలకు ఇది నిదర్శనమని అధికారులు తెలిపారు.
సైబర్ మోసాలు జరిగిన వెంటనే బాధితులు ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, అలాగే National Cyber Crime Reporting Portalలో కూడా వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫిర్యాదు ఎంత త్వరగా చేస్తే, మోసగాళ్ల ఖాతాల్లోని నగదును ఫ్రీజ్ చేసి బాధితులకు తిరిగి అందించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు.
ఆన్లైన్ పెట్టుబడులు, పార్ట్‌టైమ్ జాబ్స్, కస్టమర్ కేర్ పేరుతో వచ్చే కాల్స్, ఫేక్ లింకులు, OTPలు, స్క్రీన్ షేరింగ్ యాప్‌ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని పోలీసులు హెచ్చరించారు.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



