తెలంగాణకు కేంద్ర కేబినెట్‌లో డబుల్ ఛాన్స్..! ఈటల – డీకే అరుణకు మంత్రి పదవులు ఖరారేనా?

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణకు రెండు మంత్రి పదవులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

జూన్ 26, 2026 | స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలను మరింత పదును పెడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణకు రెండు మంత్రి పదవులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరో రెండు, మూడు రోజుల్లో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణ నుంచి ఇద్దరు నాయకులకు చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే కేంద్రంలో బండి సంజయ్, కిషన్ రెడ్డిలు మంత్రులుగా కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్ర రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మరో ఇద్దరికి అవకాశం కల్పించే అంశాన్ని బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌కు రాష్ట్ర రాజకీయాల్లో విశేష అనుభవం ఉంది. బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన సమయంలోనే కేంద్ర నాయకత్వం ఆయనకు కీలక బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడంలో ఈటల కీలక పాత్ర పోషిస్తారని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు కూడా మంత్రి పదవి రేసులో బలంగా వినిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గంలో ఆమెకు ఉన్న ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో బీజేపీని అధికారానికి మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే కేంద్ర కేబినెట్ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ అంశంపై స్పష్టత రానుంది.

— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button