రైతులకు భారీ ఊరట.. జూన్ 30న ఒకేసారి రైతుభరోసా నిధుల విడుదల

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున, రెండు సీజన్లకు కలిపి మొత్తం రూ.12 వేల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు.

హైదరాబాద్, జూన్ 26 (స్టేట్ బ్యూరో – నిజం న్యూస్):

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా పెట్టుబడి సాయం ఈసారి రైతుల ఖాతాల్లో ఒకేసారి జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

ఈ నెల 30న ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున, రెండు సీజన్లకు కలిపి మొత్తం రూ.12 వేల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు.

ఈ పథకం లబ్ధి పొందేందుకు ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. జూన్ 15వ తేదీ నాటికి భూభారతి పోర్టల్‌లో భూమి వివరాలు నమోదై, సీసీఎల్ఏ (CCLA) అనుమతులు పొందిన రైతులకు మాత్రమే ఈ సాయం అందనుంది. అలాగే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ (ROFR) పట్టాలు కలిగిన గిరిజన రైతులు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ అనుమతులు పొందాల్సి ఉంటుంది.

అర్హులైన రైతుల వివరాలను ఈ నెల 30వ తేదీలోపు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక జిల్లా పరిధిలోనే సుమారు 3.58 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉండగా, వారి కోసం రూ.460 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన 3,906 మంది రైతులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

మరోవైపు, రాబోయే వ్యవసాయ సీజన్‌లో యూరియా కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటికే 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వెంటనే రైతులకు యూరియా అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

అదేవిధంగా, త్వరలోనే వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తగిన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయాలని సూచించారు.

— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button