జూన్ 2 నుంచి మహిళలకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులు

మహిళలు ప్రతి సారి ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ కార్డుతోనే టికెట్ పొందేలా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు.

ఇక ఆర్టీసీ ఫ్రీ జర్నీకి ఆధార్ అవసరం లేదు.. స్మార్ట్ కార్డుతోనే ప్రయాణం*

హైదరాబాద్, మే 29 (నిజం న్యూస్):
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మరింత సౌకర్యవంతమైన విధానాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు ఇకపై ప్రత్యేకంగా ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులు జారీ చేయనుంది. ఈ కొత్త విధానం జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది.

ప్రభుత్వ సమాచారం ప్రకారం, మహిళలు ప్రతి సారి ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ కార్డుతోనే టికెట్ పొందేలా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు.

మొదట పైలట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. అక్కడ వచ్చిన స్పందన, సాంకేతిక సమస్యలను పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశముంది.

ఈ స్మార్ట్ కార్డులను మీసేవా కేంద్రాలు, ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్ల ద్వారా అందించనున్నారు. ఒక్కో కార్డు కోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. కార్డు జారీ అయ్యే వరకు మహిళలు ప్రస్తుతం ఉన్న విధంగానే ఆధార్ కార్డుతో ఉచిత ప్రయాణం కొనసాగించవచ్చు.

ఇప్పటికే తెలంగాణలో మహిళల ఫ్రీ బస్ జర్నీ పథకానికి భారీ స్పందన లభిస్తోంది. రోజుకు లక్షలాది మహిళలు ఈ పథకం ద్వారా ప్రయాణిస్తున్నారు. కొత్త స్మార్ట్ కార్డులతో ప్రయాణికుల వివరాలు డిజిటల్ రూపంలో నమోదవడంతో పాటు, దుర్వినియోగాన్ని కూడా తగ్గించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వం త్వరలో కార్డు దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, పంపిణీ తేదీలపై పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button