నిర్మల్ గిరుల్లో రాగాలు పలికే రాళ్లు … అరుదైన రింగింగ్ స్టోన్స్ గా గుర్తించిన పరిశోధకులు
సుమారు 66 మిలియన్ ఏళ్ల క్రితం దక్కన్ పీఠభూమిలో సంభవించిన అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల వెలువడిన లావా గడ్డకట్టి బసాల్ట్ శిలలుగా మారిన క్రమంలో ఈ ప్రత్యేక రకమైన రాళ్లు రూపుదిద్దుకున్నాయి. వీటి ఘన నిర్మాణం మరియు లోపలి ఖనిజాల సాంద్రత కారణంగా, ఏదైనా వస్తువుతో వీటిని తట్టినప్పుడు లోహం మ్రోగినట్లుగా అత్యంత మధురమైన స్వరాలు వెలువడటం ఈ శిలల ప్రత్యేకత.

మార్చి :28 (నిర్మల్ జిల్లా ప్రతినిధి: నిజం చెపుతాం ):
నిర్మల్ చుట్టుపక్కల ఉన్న గుట్టలపై ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అరుదైన ‘రింగింగ్ స్టోన్స్’ (రాగాలు పలికే రాళ్లు) వెలుగుచూశాయి.
ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు నేతృత్వంలోని బృందం జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఈ అద్భుతమైన శిలలను గుర్తించింది.
స్థానికులు వీటిని తరతరాలుగా ‘కంచు బండలు’ అని పిలుచుకుంటుండగా, శాస్త్రీయ పరిభాషలో వీటిని ‘లిథో ఫోన్స్’ అని పిలుస్తారని పరిశోధకులు వెల్లడించారు.
సుమారు 66 మిలియన్ ఏళ్ల క్రితం దక్కన్ పీఠభూమిలో సంభవించిన అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల వెలువడిన లావా గడ్డకట్టి బసాల్ట్ శిలలుగా మారిన క్రమంలో ఈ ప్రత్యేక రకమైన రాళ్లు రూపుదిద్దుకున్నాయి.
వీటి ఘన నిర్మాణం మరియు లోపలి ఖనిజాల సాంద్రత కారణంగా, ఏదైనా వస్తువుతో వీటిని తట్టినప్పుడు లోహం మ్రోగినట్లుగా అత్యంత మధురమైన స్వరాలు వెలువడటం ఈ శిలల ప్రత్యేకత.
ముఖ్యంగా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో ‘వేద శిల’గా ప్రసిద్ధి గాంచిన రాయి కూడా ఇటువంటి బసాల్ట్ శిలయేనని, ఆధ్యాత్మికతతో పాటు దీని వెనుక ఉన్న భౌగోళిక రహస్యం ఇదేనని డాక్టర్ తుమ్మల దేవరావు వివరించారు.
అలాగే నిర్మల్ ఖిల్లా గుట్టకు పశ్చిమ దిశలో ఉన్న రాళ్ల శ్రేణిలో కూడా స్వరాలు పలికే లక్షణం గల భారీ శిలను గుర్తించారు. అయితే ఈ ప్రాంతానికి చేరుకోవడం కొంత ప్రమాదకరంగా ఉండటంతో ఇవి ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి అంతగా తెలియలేదు.
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో లభ్యమైన ఈ అరుదైన భౌగోళిక సంపదను ‘జియో హెరిటేజ్ స్పాట్’గా ప్రకటించి, ప్రభుత్వం తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని పరిశోధక బృందం కోరింది.
ఇవి కేవలం రాళ్లు మాత్రమే కాదని, జిల్లా చారిత్రక, భౌగోళిక వైభవానికి నిదర్శనాలని వారు పేర్కొన్నారు.



