రెండేళ్లు గడిచినా ‘పునాది’ దాటని రామాలయ నిర్మాణం..!

ప్రశ్నార్థకంగా నిధుల మంజూరు.. కమిటీ సమన్వయం ఎక్కడ..?

అసంపూర్ణంగా ఉన్న రామ మందిర నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇట్టి మల్ల విమల్ డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని గోవిందపురం గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం ఎంతో వైభవంగా భూమి పూజ నిర్వహించినప్పటికీ, నేటికీ పనులు పునాది స్థాయిలోనే ఆగిపోవడంపై స్థానిక భక్తులు మరియు గ్రామ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.సుమారు రెండు సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అయితే కాలం గడుస్తున్నా నిర్మాణం ముందుకు సాగడం లేదు.ఇది నిధుల కొరత వల్ల జరుగుతున్న ఆలస్యమా లేక ఆలయ కమిటీ సభ్యుల మధ్య సమన్వయ లోపమా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల మరియు కమిటీ నిర్లక్ష్యం వల్లనే పనులు అటకెక్కాయని భక్తులు ఆవేదన చెందుతున్నారు.ప్రతి ఏటా సీతారాముల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకునే భక్తులు, ఈ ఏడాది కూడా అసంపూర్తిగా ఉన్న ఆలయంలోనే వేడుకలు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. కనీసం వచ్చే ఏడాది శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం నాటికైనా ఆలయ నిర్మాణం పూర్తి చేసి, నూతనాలయంలో వేడుకలు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు.భక్తుల మనోభావాలను గౌరవించి, ఆలయ నిర్మాణంలో ఉన్న ఆటంకాలను తక్షణమే తొలగించాలి. పాలక వర్గం మరియు సంబంధిత అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయవలసిందిగా కోరారు.

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button