లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ!
రూ.10 వేల లంచం స్వీకరిస్తుండగా టోలిచౌకి ఎస్ఐ అరెస్ట్

హైదరాబాద్, సెప్టెంబర్ 1 | నిజం న్యూస్:
హైదరాబాద్‌లో ఓ పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గోల్కొండ జోన్ టోలిచౌకి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఆర్. పాండు నాయక్ రూ.10 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-1 యూనిట్ అధికారులు పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుడిపై అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకుండా ఉండటం, కుటుంబ సభ్యుల మధ్య వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించడం, పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయకుండా ఉండేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.
ఫిర్యాదుదారుడి నుంచి రూ.10,000 లంచం స్వీకరించిన అనంతరం ఏసీబీ అధికారులు ఎస్ఐను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.
విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
శ్రీనివాస్ నాయక్ – స్టేట్ బ్యూరో



