శివ కుమార్ హత్య కేసులో 23 మంది అరెస్ట్
శివకుమార్ @ శివ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కేసులో మొత్తం 27 మంది నిందితులను గుర్తించిన పోలీసులు, వారిలో 23 మందిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

•9 బైకులు, 20 సెల్‌ఫోన్లు, కర్ర, చేతి కడియం స్వాధీనం
•మరో నలుగురు నిందితులు పరారీలో..
•గ్యాంగులపై కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా బ్యూరో సత్యనారాయణ,
మణుగూరు, ఆగస్టు 31 (నిజం చెపుతాం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు నేతాజీ గ్రౌండ్‌లో జరిగిన సింహాద్రి శివకుమార్ @ శివ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కేసులో మొత్తం 27 మంది నిందితులను గుర్తించిన పోలీసులు, వారిలో 23 మందిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మణుగూరు గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన సింహాద్రి శివకుమార్ @ శివ గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో ఇంటీరియర్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మణుగూరుకు చెందిన కొందరు యువకులు అతని వద్ద పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సతీష్‌తో లోకేష్‌కు గతంలో జరిగిన గొడవలో శివ జోక్యం చేసుకుని గొడవను ఆపినట్లు మృతుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనను మనసులో పెట్టుకున్న కొందరు వ్యక్తులు శివ, సతీష్‌లను ఫోన్‌లో బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగస్టు 26న కూడా ఫోన్‌లో బెదిరింపులు కొనసాగినట్లు తెలిపారు. అనంతరం ఆగస్టు 27న హైదరాబాద్ నుంచి మణుగూరుకు వచ్చిన శివ, తన స్నేహితుడు ఉదయ్‌కుమార్‌తో కలిసి నేతాజీ గ్రౌండ్‌కు వెళ్లగా, అప్పటికే అక్కడ ఉన్న పలువురు వ్యక్తులు పథకం ప్రకారం అతనిపై మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు మేరకు మణుగూరు పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 309/2026, బీఎన్‌ఎస్ సెక్షన్లు 189(2), 103(2), 109(1), 351(3), 61(2) రీడ్ విత్ 190 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*23 మంది అరెస్ట్*
దర్యాప్తులో భాగంగా పోలీసులు మొత్తం 27 మంది నిందితులను గుర్తించారు. వారిలో 23 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 9 ద్విచక్ర వాహనాలు, 20 సెల్‌ఫోన్లు, ఒక కర్ర, ఒక చేతి కడియం స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అరెస్టయిన వారిలో జెట్‌పట్ రమ్యాకాంత్ @ రమ్మీ @ జెట్టి, కందుల దినేష్, చెన్నబోయిన భరత్ @ సీహెచ్, తోలేం జంపయ్య @ పండు, రాయల వినయ్, మహమ్మద్ సాదిక్, నెట్టెం వరప్రసాద్, గనిబోయిన సాత్విక్ @ చింటూ, గుగులోత్ రమేష్ @ గోబి, కాండ్రు గణేష్, నక్క రాజా @ విక్కీ, కంగాల సాయి జగన్ @ జగన్, ఎదలపల్లి నాగేంద్రబాబు @ కన్ని, కొమెర చంటి, ఏనిక దినేష్, పున్నం వంశీ శివ @ శివ, కొమరం హరీష్ @ డాన్, ఇర్ప శ్రావణ్, కలబోయిన మల్లేష్, దేవుళ్ల దుర్గా ప్రసాద్, అక్కిరెడ్డి అభినయ్‌రెడ్డి @ అభి, సోయం నరసింహారావు @ రేకుల్, ఈర్ల లోకేశ్వర్ @ లోకేష్ ఉన్నారు.
*గత కేసులు ఉన్న వారూ అరెస్ట్*
అరెస్టయిన నిందితుల్లో కొందరిపై గతంలోనూ మణుగూరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. జెట్‌పట్ రమ్యాకాంత్‌పై పేకాట కేసు, చెన్నబోయిన భరత్‌పై రెండు కొట్లాట కేసులు, కందుల దినేష్‌పై రెండు కొట్లాట కేసులు, గనిబోయిన సాత్విక్‌పై డెకాయిటీ కేసు, గుగులోత్ రమేష్‌పై పేకాట కేసు, కాండ్రు గణేష్‌పై రెండు పోక్సో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
*గ్యాంగులపై పోలీసుల హెచ్చరిక*
మణుగూరులో ఎవరైనా ఏ పేరుతోనైనా గ్యాంగులు ఏర్పాటు చేసి సెటిల్‌మెంట్లు చేస్తూ, అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిని గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి గ్రూపులు, గ్యాంగుల సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.



